విశాఖపట్నం: రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు పాయకరావు పేట నియోజకవర్గం జనసేన కార్యకర్తలు స్పష్టం చేశారు.  పాయకరావుపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి పవన్‌కు బహుమతిగా ఇస్తామని ఆ పార్టీ నియోజకవర్గం నేత గెడ్డం బుజ్జి ధీమా వ్యక్తం చేశారు. 
నక్కపల్లిలో జనసేన పార్టీ మండల సమావేశంలో పాల్గొన్న బుజ్జి పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా గెలుపే ధ్యేయంగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. జనసేన మేనిఫెస్టో పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ జనసేన విజయం సాధించడం ఖాయమన్నారు. తమ కుటుంబం కొన్నాళ్ల నుంచి సేవా మార్గంలోనే ఉందని, త్వరలో పాయకరావుపేటకు తన నివాసాన్ని మార్చుకుంటానని జనసేన నేత నక్క రాజబాబు చెప్పారు.  

అయితే నక్క రాజబాబు జనసేన పార్టీ తరుపున పాయకరావుపేట నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తన నివాసాన్ని పాయకరావుపేటకు మార్చుకుంటానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ టిక్కెట్ పై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని పాయకరావు పేట అభ్యర్థి రాజబాబు అని చెప్పారంటూ ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు.