అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల రచయిత శామ్యూల్ జాన్సన్ చెప్పిన మాటలను ట్విట్టర్ వేదికగా పవన్ గుర్తు చేశారు. 

ఏ ప్రభుత్వమూ అధికారాన్ని ఎక్కువ రోజులు దుర్వినియోగం చేయలేదన్న ఆయన వ్యాఖ్యలను ట్విట్టర్లో పొందుపరిచారు. ప్రజలు దాన్ని ఏ మాత్రం సహించలేరని స్పష్టం చేశారు. నిరంకుశ పాలనను అంతం చేసే శక్తి మనుషుల సహజ స్వభావంలోనే అభివ్యక్త మవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం నుంచైనా అదే ప్రజలకు శ్రీరామ రక్ష అన్న శామ్యూల్ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ పుస్తకాన్ని సైతం రచించిన సంగతి తెలిసిందే.