Asianet News TeluguAsianet News Telugu

యాచించే స్థాయి కాదు.. శాసించే స్థాయికి పంచాయతీలు: పవన్ కల్యాణ్

మూడో విడతలో 2639 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 23 శాతం ఓటింగ్ జనసేన సొంతమైందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు

janasena party chief pawan kalyan comments on third phase panchayat elections ksp
Author
Amaravathi, First Published Feb 18, 2021, 10:01 PM IST

మూడో విడతలో 2639 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 23 శాతం ఓటింగ్ జనసేన సొంతమైందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ 270 కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కాయి. 1654 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు రెండో స్థానంలో నిలబడ్డారు. ఈ గణాంకాలు సంతోషకరంగా ఉన్నాయి.  ముఖ్యంగా కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులను ఎదుర్కొని జనసేన పార్టీ పంచాయతీలను కైవసం చేసుకోవడం అసామాన్య విషయం. మైసూరువారిపల్లి పంచాయతీ సర్పంచ్ గా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు భార్య శ్రీమతి సంయుక్త గారు గెలుపొందడం చాలా ఆనందాన్ని కలిగించింది. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలు, వార్డులను జనసైనికులు గెలవడం మార్పునకు సంకేతం. పోరాటయాత్ర సమయంలో అరకు ఏజెన్సీ ప్రాంతమైన డుంబ్రిగూడ మండలంలో తిరిగాను. ఆంత్రాక్స్ వ్యాధి బారినపడ్డ వారిని కలిశాను. అక్కడ నీటి వసతులు లేక ప్రజలు పడుతున్న బాధలు చూశాను. అటువంటి ప్రాంతంలో జనసేన మద్దతుదారుడు శ్రీ పూజారి కొమ్ములు గారు కొర్రమ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా గణనీయమైన సంఖ్యలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా జనసైనికుల గెలుపొందారు.

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం ములగాంపల్లి  పంచాయతీ నుంచి 24 ఏళ్ల యువకుడు శ్రీ సరియం రాజు జనసేన మద్దతుతో గెలిచారు.  పెడన నియోజకవర్గం నీలిపూడి పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే హెచ్చరికలు చేశారు. వేరే పార్టీ నుంచి పోటీ చేసినా, తమ పార్టీకి ఓట్లు వేయకపోయినా ప్రభుత్వ పథకాలన్నీ తీసేస్తామని నేరుగా బెదిరించారు. అయినా ప్రజలందరూ కలసి జనసేన మద్దతుదార్లను గెలిపించారు. మొత్తం పంచాయతీని జనసేన క్లీన్ స్వీప్ చేయడం విప్లవానికి సంకేతం. నిశ్శబ్ధ విప్లవం తీసుకురావాలని 2008లో కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ను స్థాపించాను. కులాలు, మతాలకు అతీతంగా ఆశయాలు, భావజాలం గల వ్యక్తులు బయటకు రావాలని ఆ రోజు దీన్ని ప్రారంభించాను. ఆ సంస్థ జనసేన పార్టీగా రూపుదిద్దుకుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే మార్పు వస్తుందనే  నమ్మకం చాలా బలంగా ఏర్పడింది.

నీలిపూడిలో సర్పంచ్ గా గెలుపొందిన శ్రీ పాశం కృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మచిలీపట్నం నియోజకవర్గం నేలకుర్రు పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధి 17 ఓట్ల తేడాతో ప్రత్యర్ధిపై విజయం సాధించారు. అయితే రీకౌంటింగ్ పేరు చెప్పి రిజల్ట్ ఆపే ప్రయత్నం చేయగా పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అంతా ఐక్యంగా పోరాటం చేయడం హర్షించదగ్గ విషయం.  అవగనిడ్డ నియోజకవర్గం వేకనూరులో శ్రీమతి తుంగల శ్రీలక్ష్మి, పల్నాడులో తక్కెళ్లపాడు నుంచి శ్రీ శానం వెంకటేశ్వర్లు, రాయలసీమలోని కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో జనసేన గెలుపొందడం ఆనందదాయకం. పంచాయతీ ఎన్నికలు అంటే కాకలు తీరిన వ్యక్తులు, అనుభవంతో పడిపోయిన వ్యక్తులే ఉంటారని దశాబ్ధాలుగా పాతుకుపోయిన అభిప్రాయాన్ని కొత్తతరం యువత పూర్తిగా తుడిచేశారు. రాజాంపేట నియోజకవర్గంలోని వీరబల్లి, అవనిగడ్డ రామచంద్రపురం పంచాయతీల్లో వార్డు సభ్యులుగా గెలిచిన శ్రీ గుగ్గిళ్ల వెంకటేశ్ గారు, శ్రీ సాయి భార్గవ్ గారు నూనూగు మీసాల కుర్రాళ్లు. ప్రజలకు మంచి చేయాలన్న తపనే వారిని గెలుపొందేలా చేశాయి. 

మహిళలు, యువత పోరాట స్ఫూర్తి అభినందనీయం 
పంచాయతీ ఎన్నికల్లో యువత, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయడం హర్షించదగ్గ విషయం. ఈ స్ఫూర్తి అభినందనీయం. అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురొడ్డి ఆడపడుచులు బయటకు వచ్చి పోటీ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొదటి రెండు విడతల్లో గెలిపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులతో నిన్న ఫోన్ కాన్ఫురెన్స్ లో మాట్లాడాను. తూర్పుగోదావరి జిల్లా కోలంక పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి గుబ్బల మౌనిక గారితో మాట్లాడితే.. 'నేను ఉండేది పూరిళ్లు. డబ్బు పంచే స్థోమత లేకపోయినా మార్పు రావాలనే సంకల్పంతో పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. జనసైనికుల అండగా ఉండటంతో గెలుపొందాన'ని చెప్పారు.

కృష్ణా జిల్లా అయిలూరు సర్పంచ్ గా విజయం సాధించిన శ్రీమతి పిరాటి సుజాత గారు బి.ఈడీ. విద్యను అభ్యసించినవారు. ప్రభుత్వ విధివిధానాలతో విసుగు చెంది మార్పు రావాలనే లక్ష్యంతో వచ్చానని, గ్రామంలోని మహిళలు  వ్యవసాయ పనులను. పాడిని పక్కన పెట్టి వెన్నంటి వుండి ప్రచారం చేసారని చెప్పారు. 'మా లంక గ్రామాల్లో పంట తీసుకువెళ్లే వాహనాలు దిగబడిపోతే క్రేన్ తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులు మారాలనే రాజకీయాల్లోకి వచ్చాను' అని  చెప్పారు. పంచాయతీ నిధులు దేనికైతే ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇవన్ని చూసి  రాజకీయాలు అంటే ఆస్తకి లేని యువత, ఆడపడుచులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోటీ చేయడం మార్పుకు సంకేతం. ఇదే పోరాట స్ఫూర్తిని నాలుగో దశ ఎన్నికల్లో చూపి పంచాయతీల్లో జనసేన మద్దతుదారులను గెలిపించాలి. అప్పుడే పంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదుగుతాయి. ఆ దిశగా జనసేన పార్టీ పని చేస్తుందని పవన్ కల్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios