వైసీపీకి గడప గడపలో వ్యతిరేకత.. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దాడులు: జనసేన నేత నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలను గుర్తించి ప్రజలు నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలను గుర్తించి ప్రజలు నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లక్కనపల్లెలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన నేత మధుసూదన్‌పై దాడి చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లోని తప్పులను గుర్తించి అడగడమే మధుసూదన్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
వైసీపీ చేసిన తప్పులు బయటపడుతున్నాయని.. అందుకే ఆ పార్టీ నేతలు అసహనంతో దాడులు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైపీసీ చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని.. గడప గడపకు దాడుల కార్యక్రమాంలా మార్చేశారని సెటైర్లు వేశారు. జనసేన నేత మధుసూదన్‌పై దాడి ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు గడప గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించేటప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలను గృహ నిర్బంధాలు చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.