అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. సీఎం జగన్ దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అది తన మాట కాదని మత్స్యకారులు అంటున్నారని అనేసి తప్పించుకున్నారు. 

సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లకు రూ.10 లక్షలు కేటాయించడంతో వారంతా తాము కోరుకున్న కోర్కెలు తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండానే తీర్చే దేవుడు జగన్‌ అంటూ కొనియాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోని దైవగ్రంథాలతో పోల్చడం ప్రశంసనీయమన్నారు. వైసీపీ మేనిఫెస్టో ఒకటో పేజీ నుంచి చివరి పేజీ వరకు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఏ ఉద్దేశంతో భగవద్గీతతో పోల్చారో కానీ బడ్జెట్ మాత్రం చాలా పారదర్శకంగా ఉందన్నారు. 

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. తమ అధినేత పవన్ అధికారపక్షం మాట్టాడిన వెంటనే వ్యతిరేకించమని తనకు చెప్పలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉంటే మద్దతు తెలపమన్నారని చెప్పుకొచ్చారు. 

రైతులకు వ్యవసాయాన్ని పండుగలా చేసే సీఎం వైయస్ అయితే రైతు భరోసా పథకం కింద రూ.28వేల కోట్లు కేటాయించిన జగన్ కూడా అలాంటి వ్యక్తేనని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడుతున్నంత సేప వైసీపీ ఎమ్మెల్యేలు నానా హంగామా చేశారు. 

అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సెటైర్లు వేశారు. మీరు జనసేనా....జగన్ సేనా అంటూ సెటైర్లు వేశారు. ఇకపోతే జనసేన పార్టీ బడ్జెట్ పై మిశ్రమంగా స్పందించింది. బడ్జెట్ లో సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత లేదని విమర్శించింది. 

సంక్షేమ పథకాల కేటాయింపులతోపాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని విమర్శించింది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే బడ్జెట్ బాగుందంటూ ప్రసంగించడంపై టీడీపీ సెటైర్లు వేసింది.