జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్... మంగళవారం పోలీసులకు లొంగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించారు. ఈ క్రమంలో ఏకంగా ఆయనే వచ్చి రాజోలు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 

ఇటీవల ఓ కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎస్సై...ఏక వచనంలో మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ... ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఎమ్మెల్యే రాపాకపై పోలీస్ కేసు... స్పందించిన డీఐజీ