జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై  ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్ ఖాన్ స్పందించారు. జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ని మంగళవారం డీఐజీ ఏస్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఒక బాధ్యతగల ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల సమాజంలో  యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాట్లాడిన వీడియో ఆధారంగా, పోలీస్ స్టేషన్  ముట్టడి ఘటనపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఒక మండల స్థాయి అధికారి అయిన ఎస్ఐను బాధ్యతగల ప్రజాప్రతినిధి దూషిస్తూ దాడికి పాల్పడటం సమంజసం కాదన్నారు. ఎస్ఐ తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని.. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేవాళ్లమని చెప్పారు.