అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోరు జారారు. కాగా... ఆయన మాటలకు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. దీంతో... కొద్ది సేపు అసెంబ్లీలో దుమారం రేగింది. ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ... మిత్రపక్షం బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని అధికార వైసీపీని కోరారు.

దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాపక వరప్రసాద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. తాము బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదని.. తాము కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదని గుర్తు  చేశారు. జనసేన ఎమ్మెల్యే ఏదిపడితే అది మాట్లాడితే కుదరదని చెప్పారు. టీడీపీతో జనసేన అంతర్గత పొత్తు విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్రంతో పోట్లాడే పరిస్థితి లేదని.. సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

 అంతకముందు రాపాక మాట్లాడుతూ.. అమ్మఒడి పథకం మంచి పథకమని కితాబిచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు మూతపడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు చోటు కల్పించడం శుభపరిణామన్నారు. ఎస్సీ వర్గానికి హోంమంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. అలాగే ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.