జనసేన ఎమ్మెల్యే రాపాక మరోసారి అధినేత పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చారు. జనసేన విస్తృత సమావేశానికి రాపాక డుమ్మా కొట్టారు.  ఈ సమావేశానానికి దూరంగా ఉండటం ఒక ఎత్తైతే... వైసీపీ నేత, మంత్రి కొడాలి నానితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొడనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. 

మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండగ రానుండగా... కృష్ణా జిల్లాలో మాత్రం సంబరాలు ముందుగానే వచ్చేశాయి. సంక్రాంతి సందర్బంగా గుడివాడలో ఎడ్ల పందేలు, ముగ్గుల పోటీలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఎడ్ల పందేల కార్యక్రమాన్ని మంత్రి కొడాలి నాని, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రారంభించారు. 

Also Read పోసానితో పోరు... పృథ్వీపై జగన్ సీరియస్...
గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని  రాపాక వరప్రసాద్ తెలిపారు. రైతులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ సంక్రాంతి అని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. 

ఇదిలావుంటే ఎమ్మెల్యే రాపాకపై జనసేన పార్టీ ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. ఇవాళ జరుగుతోన్న జనసేన విస్తృత స్థాయి సమావేశానికి కూడా రాపాక హాజరు కాలేదని తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు సార్లు పవన్ సమావేశానికి రాపాక డుమ్మా కొట్టారు. ఇక రాపాక వైసీపీ జెండా మోయం ఖాయమని అనుకోగానే.. తాను అలా చేయడం లేదంటూ వివరణ ఇచ్చేవాడు.

మొన్నామధ్య రాపాకకు జనసేన షోకాజ్ నోటీసులు పంపిందనే వార్తలు కూడా వచ్చాయి. వాటిని పవన్ కూడా ఖండించారు. తాను పార్టీ మారడం లేదంటూ చెబుతూనే రాపాక... కావాలని జనసేన పార్టీకి, పవన్ కి దూరంగా ఉంటున్నారని అనిపిస్తోంది. తాజాగా... పవన్ సమావేశాన్ని కాదని... మంత్రి కొడాలి నానితో వెళ్లడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్కడ కూడా సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపించడం గమనార్హం.