కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమయం వచ్చినప్పుడల్లా.. చెబుతూనే ఉంటారు. ఇక ప్రధాని నరేంద్రమోదీపైన, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ పైన కూడా  చంద్రబాబు  విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అయితే.. ఇప్పుడు అవే విమర్శలు.. చంద్రబాబుకి మరో విధంగా వచ్చి తగులుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... సంక్రాంతికి చంద్రన్న కానుకల పేరిట రేషన్ కార్డ్ లబ్దిదారులకు సరుకులు పంచుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. ఈ చంద్రన్న కానుకల్లో ఇచ్చే సరుకుల్లో బెల్లం కూడా ఒకటి. ఈ బెల్లాన్ని గుజరాత్ నుంచి తెప్పించి మరీ.. ఏపీలో ప్రజలకు పంచుతుండటం గమనార్హం.

ఏపీలో ఎక్కడా బెల్లం దొరకనట్టు.. గుజరాత్ నుంచి బెల్లం తీసుకురావాలా అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. మోదీ చుట్టూ గుజరాత్ మనుషులే ఉన్నారని.. అభివృద్ధికి కేంద్రం నిధులన్నీ అక్కడ ఖర్చుపెడుతోందని నానా యాగీ చేసే చంద్రబాబు.. ఏపీ నిధులను సైతం గుజరాత్ కే దోచి పెట్టడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో అనకాపల్లి బెల్లానికి నెంబర్ 1 స్థానం ఉంది. ఈ బెల్లాన్ని కొనుగోలు చేసినట్లయితే.. అక్కడి రైతులకు కూడా ప్రభుత్వం అండగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటిది మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి.. వేరే రాష్ట్రం నుంచి తెప్పించాల్సిన అవసరం ఏముందని విశాఖ జిల్లా జనసేన పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.