విజయవాడ: జనసేన పార్టీ పేరిట కొందరు ఫేక్ ప్రెస్ నోట్లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా జనసేన పార్టీ, నాయకులపై కుట్రలు పన్నుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జనసేనపై అసత్య ప్రచారం చేసినవారి వివరాలు అందించారు ఆ పార్టీ నాయకులు పోతిన మహేష్, ఆకుల కిరణ్.

ఇదిలావుంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కోరారు. ఆయన వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా వున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే అంశంపై కిషన్‌రెడ్డితో కాసేపు చర్చించారు. ఈ అంశంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని పవన్ కల్యాణ్ కోరారు. 

read more   జగన్ లేఖ ప్రజలను మభ్యపెట్టేందుకే: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్

మంగళవారం ఇదే అంశంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నిక అంశం కూడా ఇద్దరి మధ్యా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. కాగా, వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఆయన ఢిల్లీ పయనమయ్యారు. పవన్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు.

తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే అంశంపై వెనక్కి తగ్గేది లేదని పవన్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా జనసేనాని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం వుంది.