జగన్ లేఖ ప్రజలను మభ్యపెట్టేందుకే: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ చేయాలనుకొంటే ఏదైనా చేయవచ్చని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ పై తుది నిర్ణయం కేంద్రానిదేనని ఆయన తెలిపారు.
హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ చేయాలనుకొంటే ఏదైనా చేయవచ్చని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ పై తుది నిర్ణయం కేంద్రానిదేనని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీలో బుధవారం నాడు సాయంత్రం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.తమ వినతి గురించి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని తాము కోరామన్నారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ సర్కార్ కేంద్రానికి లేఖ రాసినట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల మనోభావాలకు ప్రతీకగా చూడాలని ఆయన కోరారు.
దేశంలో కొన్నేళ్లుగా ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఏపీలో శాంతి భద్రతల పరిస్థితిని అమిత్ షా కు వివరించినట్టుగా ఆయన చెప్పారు. దేవాలయాలపై దాడుల గురించి కూడ ప్రస్తావించినట్టుగా చెప్పారు.
ఈ ఏడాది మార్చి 3 లేదా 4 తేదీన బీజేపీ, జనసేన పార్టీలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేకత ఉన్నందున ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని అమిత్ షా ను కోరినట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు.