గుంటూరు: స్ధానిక సంస్థల ఎన్నికల వేళ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకువచ్చి బెదిరించి ఓట్లు వేయించుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని... దాన్ని ఎదుర్కొనే శక్తి కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కరోనాకే భయపడని జనసైనికులు.. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయపడతారని ఆయన అన్నారు. 

సోమవారం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల జనసేన పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల బరిలో దిగిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ...గ్రామ పంచాయతీ వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని... అలాంటి పరిస్థితుల్లో నిలబడింది పవన్ కల్యాణ్, జన సైనికులేనని అన్నారు. 

''పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో రకాల ఒత్తిళ్లు తీసుకువచ్చారు. నాడు కరోనాని లెక్క చేయని జనసైనికులు.. జగన్ రెడ్డిని లెక్క చేస్తారా? పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు యువత ఎంతో ధైర్యంగా నిలబడింది. అభ్యర్ధులు లేని చోట్ల రాత్రికి రాత్రి తమ భార్యలు, తల్లులను నిలబెట్టుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని దమ్మాలపాడులో రాళ్లదాడి చేశారు. 15 కుట్లు పడి ఆసుపత్రిలో చేరారు మన జన సైనికులు. ఆ పరిస్థితిలో సైతం 38 ఓట్ల తేడాతో సర్పంచ్ ని గెలిపించుకున్నారు'' అన్నారు. 

read more   ముగిసిన పంచాయితీ ఎన్నికలు...మొత్తం ఏకగ్రీవాల శాతం ఎంతంటే: ఎస్ఈసి నిమ్మగడ్డ
 
''గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా జన్మభూమి కమిటీలు వేసి ఇలాంటి పరిస్థితులనే సృష్టించింది. ప్రభుత్వ పథకాలు ఇచ్చేందుకు ఓట్లు వేస్తామని సంతకాలు చేయమని విసిగించారు. ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఒక్క ఛాన్స్ అని అడిగితే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఒక మాట.. గెలిచాక ఒక మాట మాట్లాడుతున్నారు. ఏకగ్రీవాలకు స్వయంగా పిలుపు ఇచ్చారు. అన్ని పంచాయతీలు ఏకగ్రీవం చేయమని మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా మంత్రులు జిల్లాల వెంట పడి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు'' అని నాదెండ్ల ఆరోపించారు.

''ఎన్నికల ప్రక్రియ మీద యువత అవగాహన తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ ఏజెంట్ అంటే ఏంటి, కౌంటింగ్ ఏజెంట్ అంటే ఏంటి అన్న అవగాహన తెచ్చుకోవాలని చెప్పారు. మొదటి విడత నుంచి నాలుగో విడత వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే ఎంతో మార్పు వచ్చిందన్న విషయం అర్ధమవుతుంది. ఆర్ధికంగా స్థోమత లేకపోయినా పోటీ చేశారు. ఓట్లు అడిగారు. కేవలం రూ. 35 వేల ఖర్చుతో ఎన్నికల ప్రక్రియ ముగించిన ఘనత జనసేన పార్టీ అభ్యర్ధులకే దక్కుతుంది'' అని నాదెండ్ల పేర్కొన్నారు.