నదీ ప్రవాహాలను అడ్డుకునేలా రోడ్డేసి మరీ వైసిపి నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
విజయవాడ : అధికార అండతో వైసిపి నాయకులు యధేచ్చగా ఇసుక దోపిడీ చేస్తున్నారని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసిపిలో కీలక నాయకుల నుండి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ ఇసుక అక్రమ తవ్వకాలు, అమ్మకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇలా అక్రమార్జన కోసం అడ్డగోలుగా ఇసుక, మట్టిని తవ్వేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. కానీ ఈ అక్రమ తవ్వకాలపై న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేస్తూ అడ్డుకొంటున్న జనసేన నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు.
మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం తాతపూడి దగ్గర గోదావరి తీరంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని... దీనిపై హైకోర్టుకు వెళ్లి పోరాడుతున్న నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ వేధిస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. లంక భూముల్లో యధేచ్చగా మట్టి తవ్వేస్తున్న విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి లీలాకృష్ణ తీసుకువెళ్లారని అన్నారు. దీంతో లీలాకృష్ణతో పాటు మరో ముగ్గురు జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసారని... దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. దోపిడీని అడ్డుకొంటే కేసులుపెడతారా? అని నాదెండ్ల నిలదీసారు.
Read More Pawan Kalyan| తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్
అప్రజాస్వామికంగా పెట్టిన అక్రమ కేసులపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని నాదెండ్ల అన్నారు. ఓవైపు రెవెన్యూ అధికారులు అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని చెబుతుంటే... పోలీసులు మాత్రం వాటిని అడ్డుకోడానికి ప్రయత్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. గోదావరి నదీ ప్రవాహాన్ని అడ్డుకొనేలా రోడ్డు వేసి మరీ తవ్వుతున్నారని... దోపిడీ కోసం వైసీపీ నాయకులు ఏ స్థాయిలో బరి తెగిస్తున్నారో అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న ఇసుక, మట్టి దోపిడీని జనసేన పార్టీ ఖచ్చితంగా నిలువరిస్తుందని నాదెండ్ల అన్నారు.
ఇక స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు దండుకుంటున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ఇసుక అక్రమ విక్రయాల ద్వారా రోజుకు రూ.3 కోట్లు, నెలకు రూ.1,000 కోట్లు సీఎం కు సమకూరుతున్నాయని ఆరోపించారు. దీన్నిబట్టి అక్రమ ఇసుక విక్రయాల ద్వారా ఎంత సొమ్ము దండుకుంటున్నారో ఇట్టే ఊహించుకోవచ్చునని లోకేష్ అన్నారు.
టీడీపీ హయాంలో టన్ను ఇసుక ధర కేవలం రూ.1,000 మాత్రమే ఉండేదని తెలిపిన లోకేశ్ తెలిపారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చేతగాని పాలనలో ఇసుక ధర రూ.5 వేలకు పెరిగిందని లోకేష్ విమర్శించారు.
