విశాఖపట్నంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.
విశాఖపట్నం : విశాఖపట్నంలోని టైకూన్ సెంటర్ మూసివేతపై వివాదం కొనసాగుతోంది. అధికార పార్టీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంకోసమే ఏకంగా రోడ్డునే మూసేయడం దారుణమని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఈ రోడ్డు మూసివేతకు నిరసనగా జనసేన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టైకూన్ సెంటర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.
జనసేన ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నోవాటెల్ గేట్లు మూసేసి నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర జనసేన నాయకులెవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టైకూన్ జంక్షన్ కు వెళ్లేందుకు అనుమతి లేదని నాదెండ్లకు పోలీసులు సూచించారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో నాదెండ్ల మనోహర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుండి తరలించారు. అనంతరం జనసేన నాయకులను కూడా చెదరగొట్టారు.

నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన నాయకుల అరెస్ట్ ను టిడిపి ఖండించింది. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే టైకూన్ జంక్షన్‌ను వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసం మూసేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని ఏపి టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నించిన జనసేన నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేతలపై పోలీసుల దౌర్జన్యం సరికాదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
వైసిపి నేతల ఆస్తులకు వాస్తుదోషం వుంటే ఏకంగా రోడ్డునే మూసేస్తారా? ఇది వైసిపి అరాచకాలు ఏ స్థాయిలో వున్నాయో అద్దం పడుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. రోడ్లు వేసే దమ్ములేదు కానీ ఉన్నరోడ్లను మూసేస్తారా? అని నిలదీసారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలుకావడం లేదని... ప్రజాప్రయోజనాల కోసం
ఉపయోగించాల్సిన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా వైసిపి ప్రభుత్వం దారిమళ్లించి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విశాఖపట్నం టైకూన్ సెంటర్ రహదారిని పునరుద్దరించాలి... అరెస్ట్ చేసిన జనసేన నాయకులను విడుదల చేయాలని టిడిపి డిమాండ్ చేస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు.
ఏమిటీ టైకూన్ సెంటర్ వివాదం :
విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ నుండి విఐపి రోడ్డుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేసారు. నాలుగు నెలల క్రితమే టైకూన్ సెంటర్ వద్ద రోడ్డును మూసేసారు. అయితే ఇలా హటాత్తుగా ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయాడానికి ఇదే రోడ్డులో నిర్మిస్తున్న వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణకి భవనమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భవనానికి వాస్తు దోషం వుందని ఏకంగా రోడ్డునే మూసేసారని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఆస్తుల అధికారులు ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయడం దారుణమని జనసేన నాయకులు అంటున్నారు.
Also Read మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా..
