విజయవాడ: పార్టీ గుర్తు లేకపోవడంతో కాస్త నిరుత్సాహంలో ఉన్న జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. పార్టీ గుర్తును కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఉమ్మడి గుర్తు లేదని బాధపడుతున్న కార్యకర్తలకు ఎన్నికల సంఘం గుర్తు ప్రకటించడం వారిలో మరింత జోష్ ని పెంచినట్లైంది. 

జనసేన పార్టీకి ఉమ్మడి గుర్తు ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శనివారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు వివిధ గుర్తులను కేటాయించిన ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. 

2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఈ గుర్తు వర్తిస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. అలాగే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ గుర్తు మీద అభ్యర్థులు పోటీ చెయ్యాల్సి ఉంటుందని తెలిపింది.  

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో ఆ పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో గ్లాసు గుర్తు ఫొటో షేర్ చేసి తమ కామెంట్లు జత చేస్తున్నారు. 


మరికొందరు జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ పలు సినిమాలలో గాజు గ్లాసుతో టీ తాగుతున్న ఫోటోలను పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు చిత్రంలోని ఛాయ్ చటుక్కున తాగరా భాయ్ అన్న సాంగ్ వీడియోను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. 
 
సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకూ అందరి దాహం తీర్చే గ్లాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు కేటాయించడంతో ఆ గుర్తును మారుమూల పల్లె వరకు తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.  అటు పార్టీ సైతం జనసేన పార్టీ ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చింది.