అనంతపురం : జనసేన పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అందుకు తగ్గట్లు ప్రణాళిక రెడీ చేస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర పేరుతో రాష్ట్రమంతటా పర్యటిస్తుంటే మరోవైపు జనసేన తరంగం అనే కార్యక్రమం ద్వారా కార్యకర్తలను ప్రజల్లోకి పంపేలా వ్యూహరచన చేశారు. 

ఈనెల 5న ఉదయం 11 గంటలకు ఈ జనసేన తరంగం కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టో అంశాలు, సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు తెలియచెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

ప్రతి ఇంటి తలుపు తట్టి మేనిఫెస్టోలోని ఆలోచన విధానాలు, ఏడు సిద్ధాంతాలను వివరించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు జనసేన తరంగం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. మంగళవారం ఉదయం అనంతపురం నుంచి ఫేస్ బుక్ లైవ్ ద్వారా జనసేన సైనికులకు పలు సూచనలు చేశారు. 

ఈనెల 5 నుంచి అయిదు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి యువకుడు, యువతి, పెద్దలు పాల్గొనాలని కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా రేప‌టి త‌రం కోసం జనసేన చేస్తున్న నవతరం రాజకీయాలను తెలియచెప్పాలని సూచించారు. 

ఇన్నాళ్ళు కుల, మత, ప్రాంతాల ముసుగులో యువతను అభివృద్ధికి దూరం చేశారని ఎందుకు రాజ‌కీయాలు మారాలో చెబుతూ మన పార్టీ ప్రజలకు ఎలా అండగా నిలుస్తుందో వెల్లడించాలని కోరారు. 25 కేజీల బియ్యం కాదు 25 సంవ‌త్సరాల భ‌విష్య‌త్ ఇచ్చేందుకు జనసేన ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని బంగారు ఆంధ్ర‌ప్ర‌దేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్,


 ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు జనసేన ముందుకు కదులుతుందని పవన్ తెలిపారు. జన సైనికులు వెళ్లదలచుకున్న ఇంటి తలుపు తట్టి పార్టీ గురించి వివరిస్తూ ఫేస్ బుక్ లైవ్ పెట్టాలని తెలిపారు. తాను కూడా ఈ క్రమంలో లైవ్ ద్వారా కొందరితో మాట్లాడతానని పవన్ తెలిపారు. 

ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. అవినీతిమయంతో నిండిపోయి, ప్రజలను అభివృద్ధికి ఎలా దూరం చేశారో వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి అభివృద్ధిలో మమేకం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ జనసేన ఆశయాలను తెలియచేద్దాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

ఈ సందర్భంగా జనసేన సిద్ధాంతాలను, మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో పొందుపరచిన అంశాలను వివరించి కరపత్రాన్ని అందజేయ్యాలని సూచించారు.