విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన అందించాలని హెచ్చరించారు. 

తనను విమర్శించే ప్రతీ ఎమ్మెల్యే బలహీనతలు బయటపెట్టగలరా అంటూ సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రత్యర్థి ఉండాలని స్పష్టం చేశారు. ప్రత్యర్థి ఉంటేనే పోరాటం చేస్తామని లేకపోతే ఎవరితో పోరాటం చేస్తామని పవన్ అభిప్రాయపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందని మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించారు. నిత్యం విమర్శలు చేస్తూ ఉంటే ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయన్నారు. 

తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల సమస్యలు పరిష్కరించేందుకేనని చెప్పుకొచ్చారు. అంతేగానీ సంపాదించుకోవడానికి కాదన్నారు. తనకు సంపాదనే కావాలంటే ఒక్క సినిమా చేస్తే చాలన్నారు. 

జగన్మోహన్ రెడ్డికి భారతి సిమ్మెంట్ కంపెనీ ఉందని, జగతి పబ్లికేషన్స్ సాక్షి టీవీ, పేపర్ లేవా అని నిలదీశారు. రాజకీయాలు చేస్తున్నారు వారు వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు డబ్బు సంపాదించాలంటే కంపెనీలు పెట్టాలని సంతకాలు పెట్టాలని సెటైర్లు వేశారు. తాను ఒక సినిమాకు సంతకం పెడితే 100 కోట్లు వస్తాయన్నారు. 

కానీ తాను తప్పుడు పనులు చేసి గానీ సంతకాలు పెట్టడం కానీ చేయబోనన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే వైసీపీ నేతలు జనసేన నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. కార్యకర్తలంతా కలిసి ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. 

బాహాబాహి చూసుకుందామంటే చూసుకుందామన్నారు. విమర్శలు చేసుకుంటూ పోవాలంటే తనకు చాలా పెద్ద నోరు ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే జనసైనికులు అంతా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. 

గతంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును కూడా ఇబ్బంది పెట్టాలని చూశారని వారికి ధైర్యంగా ఉండేందుకు తామంతా రాజోలు వెళ్లిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. అంతా కలిసికట్టుగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమంటూ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. పులివెందులలో రాజధాని పెట్టుకుని కర్నూలులో హైకోర్టు పెడితే వచ్చేందుకు వెళ్లేందుకు ఖర్చులు తగ్గుతాయన్నారు.

ఇకపోతే మంత్రి బొత్స సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర  కోసం ఏం పాటుపడ్డారో తెలపాలని డిమాండ్ చేశారు. ఏనాడు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేయలేదని చెప్పుకొచ్చారు. 

హైకోర్టును చీపురుపల్లిలో పెట్టాలని మంత్రి బొత్సను కోరదామంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఇకపోతే బొత్స సత్యనారాయణను ఏం చేశారని నిలదీయవద్దని ఆయన ప్రెస్మీట్ కు వెళ్లి అలాగే నిల్చుంటే ఆయన వెన్నులో వణుకుపుడుతుందంటూ నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ బలం ముందు జనసేన బలం సరిపోదు కానీ.....: పవన్ కళ్యాణ్

ఆ బొగ్గు క్షేత్రంపై జగన్ కన్ను: ప్రధాని మోదీకి లేఖ