విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని విమర్శించారు. 151మంది ఎమ్మెల్యేలున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనపై ఆరోపణలు చేస్తున్నారంటే ఎవరు ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు.  

ప్రజా బలం ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన లాంగ్ మార్చ్ కి వచ్చిన యువతలో 70శాతం ఓట్లేసినా జనసేనకు 70 సీట్లు వచ్చేవన్నారు.
వెన్నుపోటు పొడుస్తామంటే పొడిపించుకుంటామా? అని ప్రశ్నించారు. 

దెబ్బ తినడానికి రాలేదని, ఒకవేళ దెబ్బ తిన్నా కూడా తిరిగికొడతామని పవన్‌ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది శాసన సభ్యుల బలం ఉంటే జనసేన పార్టీకి ఒకరు మాత్రమే ఉన్నారని తెలిపారు. 

వైసీపీ బలం ముందు జనసేన బలం సరిపోదన్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్ లో అంతమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారంటే సమస్య ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్రజల్లో లేని భావోద్వేగాన్ని కోపాన్ని తీసుకురాలేం కదా అని చెప్పుకొచ్చారు. 

అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీకి ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత దూషణలతో సమస్యలు పరిష్కారం కావని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పార్టీని నడపడం ఆర్థిక భారమే... కానీ అదొక్కటి కావాల్సిందే..: పవన్ కల్యాణ్