ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేంటి ప్రతినిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే పవన్.. జగన్‌ని ప్రశంసించడమేంటనే డౌట్ మీకు రావొచ్చు.

వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో దివీస్‌ పరిశ్రమ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే గత కొద్దిరోజులుగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో నిరసనకు దిగిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై జనసేన అధ్యక్షుడు, పవన్‌ కళ్యాణ్‌ ఆదివారం స్పందించారు.

Also Read:పవన్‌తో సోము వీర్రాజు భేటీ... తిరుపతి ఉప ఎన్నికపై కీలక చర్చ

దీనిపై ఓ ప్రకటనను విడుదల చేసిన పవన్‌ అందులో కొన్ని విషయాలను ప్రస్తావించారు.. ‘దివీస్‌ కర్మాగారంతో పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలి.

ఇక దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించింది. హైకోర్టు, సీఎం జగన్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దివీస్ కర్మాగారం విడుదల చేసే కాలుష్యంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

36 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అరెస్ట్‌ అయిన వారికి బెయిలు రావడానికి సహకరించిన అందరికీ జనసేన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలి’ అని లేఖలో ప్రస్తావించారు.