కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దీక్ష గురువారం నాడు ప్రారంభించారు.ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు.కాకినాడ జేఎన్‌టీయూకు ఎదురుగా పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు.

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని  ఏపీ ప్రభుత్వానికి గతంలోనే పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సమయం ఇచ్చారు. ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడలో దీక్షను ప్రారంభించారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మహిళలు హారతులు పట్టి దీక్షకు స్వాగతం పలికారు. రైతులు  పూలమాలలు వేసి పవన్ కళ్యాణ్‌ను దీక్షకు ఆహ్వానించారు.  రైతు దీక్షకు సంకేతంగా  రైతులు, పార్టీ నాయకులు ఆకుపచ్చని కండువాను కప్పి, వరి కంకులు బహుకరించారు. 

రైతులు వరి కంకులు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు బహుకరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు, నాయకులు, రైతులకు అభివాదం చేస్తూ  పవన్ కళ్యాణ్  దీక్షకు కూర్చున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహార్, నాగబాబు తదితరులు కూడ దీక్షకు కూర్చొన్నారు. 

తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు  చెందిన నాయకులు, రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మరో వైపు జనసేనాని దీక్షకు జన సైనికులు, రైతులు భారీగా తరలి వచ్చారు.  రాష్ట్ర నలుమూలల  నుంచి లక్షలాది జన సైనికులు కాకినాడ చేరుకొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడటమే దీక్షయెుక్క ముఖ్య ఉద్దేశమని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని జనసేన కోరిన విషయం తెలిసిందే.

ప్రతి ఒక్క జనసైనికుడు కాకినాడ చేరుకొని అద్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. 

వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. 

రైతులకు బాసటగా నిలించేందుకు ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో పవన్ కళ్యాణ్ నిరసన దీక్షకు దిగారు. 

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి మూడు రోజులు డెడ్ లైన్ విధించారు. ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ దీక్షకు దిగినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.