వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఓదార్పు యాత్రలు చేసి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారంటూ జనసేనాని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యేలకు కూడా డబ్బు మదమెక్కిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు
వైసీపీ నేతలపై (YSRCP) మండిపడ్డారు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) . కౌలు రైతు భరోసా యాత్రలో (janasena koulu rythu bharosa) భాగంగా ఆదివారం ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పర్చూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగనప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్ట్ (veligonda project) ఇంత వరకు పూర్తికాకున్నా అడిగే నాయకుల్లేరని ఆయన ధ్వజమెత్తారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్లడం లేదని పవన్ అన్నారు. ఎమ్మెల్యేలకు కూడా డబ్బు మదమెక్కిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అంటే సహించలేరని పవన్ దుయ్యబట్టారు. ఓదార్పు యాత్రలు చేసి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారంటూ జనసేనాని సెటైర్లు వేశారు. కేసులు వుంటే ఏ ఉద్యోగం రాదు.. మరి ఎమ్మెల్యేలకు ఇవి వర్తించవా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వ్యవస్థలను ఉపయోగించరని ఆయన మండిపడ్డారు. కక్ష సాధింపు కోసమే వ్యవస్థల్ని వాడుతారంటూ పవన్ ఆరోపించారు. తనకు డబ్బు అవసరం లేదని.. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయన స్పష్టం చేశారు. జనసేన అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్ధితుల్లోనే ఒకరి వ్యక్తిత్వం బయటపడుతుందని ఆయన అన్నారు.
