Asianet News TeluguAsianet News Telugu

ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం.. అప్పుడు అమ్మ ఒడి, ఇప్పుడు అమ్మకానికో బడి: జగన్ సర్కారుపై పవన్ విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan). నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటామని, కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేస్తున్నారని పవన్ విమర్శించారు. 

janasena chief pawan kalyan slams ycp govt over aided institutions merging
Author
Amaravati, First Published Nov 14, 2021, 4:19 PM IST

ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan). నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటామని, కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేస్తున్నారని పవన్ విమర్శించారు. కనీసం వారికి ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే అవకాశం కూడా వారికి లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారని .. చివరికి మా పాఠశాల తీసేయొద్దు అంటూ ఆ పసివాళ్లు ఆందోళన చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు అమ్మ ఒడి అన్నారు, ఇప్పుడు అమ్మకానికో బడి అంటున్నారని విమర్శించారు.

ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై (aided institutions merging) ఏపీ సర్కారు నవంబరు 12న నాలుగు ఆప్షన్లతో సర్క్యులర్ మెమో ఇచ్చిందని పవన్ గుర్తుచేశారు. ఈ విధానం కారణంగా రాష్ట్రంలో 2,200 ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, 2 లక్షల మంది విద్యార్థులతో పాటు 6,700 మంది టీచర్లు ప్రభావితమవుతారని ఆయన తెలిపారు. అంతేకాకుండా 182 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 71 వేల మంది విద్యార్థులు, 116 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 2.5 లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఆయా ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపైనా ఈ ప్రభావం పడుతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read:ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం: ఆ నాలుగు ఆప్షన్ల వెనుక ఏదో మతలబు.. జగన్ సర్కార్‌పై పవన్ వ్యాఖ్యలు

ముఖ్యంగా నష్టపోయేది విద్యార్థులేనని, ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకింత హడావుడి చేస్తుందో అర్థంకావడంలేదని జనసేనాని వ్యాఖ్యానించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా, ఒక అనాలోచిత విధానాన్ని అమలు చేయడం సరైన నిర్ణయమేనా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నిజంగా సాయపడాలని అనుకుంటే వాటిని విలీనం చేసుకోవడం ఒక్కటే మార్గమా? ప్రత్యామ్నాయ విధానాలు ఏవీ లేవా? అని పవన్ నిలదీశారు.

విద్యాసంవత్సరం మధ్యలో ఉండగా ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామంటున్నారని.. ఆ విద్యార్థులను సమీపంలోని ఇతర విద్యాసంస్థల్లో చేర్చుతామంటున్నారని దీనివల్ల విద్యా సంవత్సరంలో కుదుపులకు గురికారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు? వైసీపీ ప్రభుత్వం ఇంతకీ ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందని ఆయన నిలదీశారు. ముందు ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్లను, లెక్చరర్లను నియమించి, ఆ తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థల గురించి ఆలోచించాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు.a

Follow Us:
Download App:
  • android
  • ios