మంత్రి బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బొత్స పెరిగితే తూర్పు కాపులు పెరిగినట్లు కాదన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తప్పిస్తే.. బొత్స ఎందుకు మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు.
బీసీల కోసం రాష్ట్ర బంద్‌కు సిద్ధమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీల సమస్యల పరిష్కారానికి ఒక రోజు దీక్ష చేస్తానని పవన్ అన్నారు. 2024లో బీసీలకు ఏం చేస్తామో జనసేన ఆవిర్భావ సభలో చెబుతానని ఆయన తెలిపారు. బొత్స పెరిగితే తూర్పు కాపులు పెరిగినట్లు కాదన్నారు. ఉత్తరాంధ్ర బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తప్పిస్తే.. ధర్మాన,బొత్స ఎందుకు మాట్లాడలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
బీసీల అనైక్యతే మిగిలిన వారికి బలమని.. ముందుగా వారు ఐక్యత సాధించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదని.. కాపులకే కాకుండా ప్రజలందరికీ నాయకుడిగా వుండాలనుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజ్యాధికారాన్ని పోరాడి సాధించుకోవాల్సిందేనని పవన్ పిలుపునిచ్చారు. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే జీవితకాలం గులాంగిరీ తప్పదని ఆయన పేర్కొన్నారు.
బీసీ నేతను ఎన్నికల్లో నిలబెడితే అతడిని మిగిలిన వారంతా ఓటేసి గెలిపించుకుండా వుంటారా అని పవన్ పేర్కొన్నారు. బీసీ నేతలను చూస్తే తాను కూడా భయపడే పరిస్ధితి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏదైనా విషయంపై మాట్లాడితే.. బీసీలు, కాపులు, దళిత నేతల చేత తిట్టిస్తారని దీని వెనుక వ్యూహం వుందని పవన్ ఆరోపించారు. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారని.. దీనిపై బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
