ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టడం కాదని.. ఎన్టీఆర్‌కు బదులు వైఎస్సార్ అని పెడితే వర్సిటీలో వసతులు మెరుగైపోతాయా అని ఆయన నిలదీశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం సహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం ద్వారా మీరేం సాధించాలని అనుకుంటున్నారని పవన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు బదులు వైఎస్సార్ అని పెడితే వర్సిటీలో వసతులు మెరుగైపోతాయా అని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు ప్రమాణాలకు తగిన విధంగా లేవని, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని బెడ్స్ లేదని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. సిబ్బంది, మందులు అందుబాటులో వుండవని.. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్‌ని వేధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త వివాదాలు సృష్టించేందుకో.. ప్రజల దృష్టిని మరల్చేందుకో చేసిన ప్రయత్నంలా వర్సిటీ పేరు మార్పు వ్యవహారం వుందని పవన్ ఆరోపించారు. అంతగా పేర్లు మార్చాలి అనుకుంటే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి.. ఇంకా బ్రిటీష్ వాసనలతోనే వుందని దాని పేరు మార్చొచ్చు కదా అంటూ పవన్ ఎద్దేవా చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు ఈ పాలకులకు తెలుసా అని పవన్ ప్రశ్నించారు. బోదకాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులకు ఆయన మందులను కనుగొన్నారని జనసేనాని గుర్తుచేశారు. తెలుగు వారైన యెల్లాప్రగడ పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులు పెట్టారా అని పవన్ ప్రశ్నించారు . ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టడం కాదని.. జనక్షేమం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలంటూ సీఎం జగన్‌కు ఆయన చురకలు వేశారు.
ALso Read:ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం..?: చంద్రబాబు
కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు. వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు.
అనంతరం ఈ విషయమై సీఎం జగన్ కూడా ప్రసంగించారు. ఎన్టీఆర్ ను కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. వైద్య రంగంలో సేవలు చేసినందుకే వైఎస్ఆర్ పేరును మెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఆ టర్మ్ కూడా పూర్తి కాలం పాటు పదవిలో ఉండేవారేమోనని జగన్ అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు నాయుడు ఏనాటికి కూడా సీఎం కాకపోయి ఉండేవారేమోననే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
