Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం..?: చంద్రబాబు

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

Chandrababu Naidu Slams YSRCP Govt Over name change of ntr health university
Author
First Published Sep 21, 2022, 2:22 PM IST

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.  వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 

ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో తమ ప్రభుత్వం హయాంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టామని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదని అన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితమని అన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్  ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని విమర్శించారు. 

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుందని ప్రశ్నించారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. 

 

దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా... ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారని అన్నారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించాలని సూచించారు. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిథిగా  కొనసాగించాలని కోరారు. 

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం శాసనసభలో బిల్లు పెట్టింది. వర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందినట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios