మారితే గౌరవిస్తా.. లేదంటే జగన్ రెడ్డి అనే పిలుస్తా: తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన వీళ్లకి ఎవరూ భయపడొద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన వీళ్లకి ఎవరూ భయపడొద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను ఎన్నోసార్లు రాయలసీమకు వచ్చానని.. కానీ ఇక్కడ వారిలో చూసినంత ఆవేదన, కోపం మరెక్కడా చూడలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఆదివారం కడప జిల్లా రైల్వేకోడూరులో ఆయన పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... రాయలసీమలో కరువు లేదని, కరువు సృష్టించబడిందని పవన్ అభిప్రాయపడ్డారు.
Also Read:నవంబర్ 29తో జగన్ కు లింకేంటి: ఆ నిర్ణయం తీసుకోకపోతే సీఎం అయ్యేవారే కాదా...
రాయలవారు ఏలిన ఆ రోజుల్లో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉన్నప్పుడు ఇప్పుడెందుకు పంటలు పండవని పవన్ ప్రశ్నించారు. సీమ వెనుకబాటు తనానికి రాజకీయ నాయకులే కారణమని, ఇతరులపై కోపంతో చినీ చెట్లను నరికేసే సంస్కృతి మారాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ సంపద జగన్ రెడ్డిదే కాదని అందరిది అంటూ ఆయన మండిపడ్డారు.
అన్యాయం జరిగిందని గొంతెత్తి ప్రతిఘటించకపోతే వాళ్లు మనల్ని ఏక్కితొక్కేస్తారని పవన్ తెలిపారు. రాయలసీమ అంటే నరుక్కోవడం, చంపుకోవడం కాదని.. వాళ్లు దాడులు చేస్తే, మనం తిరిగి దాడులు చేయలేమా అని ఆయన ప్రశ్నించారు.
తనకు జీవితంలో నచ్చని పదం పిరికితనమని, తాను రైల్వేకోడూరులో ఇళ్లు తీసుకుని ప్రజల్లో ధైర్యాన్ని నింపుతానని పవన్ స్పష్టం చేశారు. రాయలసీమలోనే మొట్టమొదటి తెలుగు శిలాఫలకాలు దొరికాయని.. కోస్తా ప్రజలకన్నా, రాయలసీమ వారే ఉన్నత విద్యావంతులని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రిలా మాట్లాడితే ఎవరైనా గౌరవం ఇస్తారని, అయితే ఆయన కొద్దిమందికే సీఎంలా వ్యవహరిస్తున్నారని అందుకనే తాను జగన్ రెడ్డి అని పిలుస్తానని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, జగన్ సీఎంలా హుందాగా మాట్లాడాలని జనసేనాని సూచించారు. కడపలో ఉక్కు కార్మగారానికి బదులు అణుశుద్ధి కార్మాగారాన్ని నెలకొల్పాల్సిందిగా జగన్... ప్రధానిని కోరారని పవన్ గుర్తుచేశారు.
Also Read:జగన్ ఫుల్ జోష్, బొత్స నోటికి తాళం: అసలు లోగుట్టు ఇదే....
కొందరు తమను బెదిరించడం వల్లే జనసేనకు ఓట్లు వేయలేకపోయామని తనకు కొందరు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీని ప్రత్యేకహోదా అడిగే ధైర్యం జగన్‌కు లేదని... పసుపు రైతులకు న్యాయం చేయలేరా అని పవన్ ప్రశ్నించారు.