ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పాదయాత్రలో కన్నీళ్లు తుడిస్తే సరిపొదని.. అధికారంలోకి వచ్చాక కూడా ఆ పనిచేయాలన్నారు. దత్తపుత్రుడు అని వారి నోటి నుంచి వస్తే సీబీఐ దత్తపుత్రుడని ఫిక్స్ అవుతామని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

తాను రెండో చోట్లా ఓడింపబడ్డ వాడినని.. తనకు ఓటమి అంటే భయం లేదన్నారు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan). ఏలూరు జిల్లా (eluru district) చింతలపూడిలో (chinthalapudi) ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి జనసేన తరపున ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా చింతలపూడిలో ఏర్పాటు చేసిన జనసేన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాను వస్తున్నానని ఒక సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతులకు పరిహారం ఇచ్చారని.. మిగిలిన సామాజిక వర్గాల రైతుల్ని వదిలేశారని పవన్ ఆరోపించారు. జనసేన కావాలో, వైసీపీ (ysrcp) కావాలో యువత తేల్చుకోవాలని.. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు టెక్నికల్‌గా సాధ్యం కాదంటున్నారని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. 

దేశంలో 80 శాతం వ్యవసాయాన్ని కౌలు రైతులే చేస్తున్నారని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. .. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం అండగా లేదని ఆయన ఆరోపించారు. వైసీపీ సర్కార్ కౌలు రైతులకు అండగా వుంటే తాను రోడ్లపైకి వచ్చే పరిస్ధితి వుండేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. పాదయాత్రలో కన్నీళ్లు తుడిస్తే సరిపొదని.. అధికారంలోకి వచ్చాక కూడా ఆ పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో వుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కౌలు రైతుల కష్టాలు పరిష్కరించకుండా తనను దత్తపుత్రుడు అని విమర్శిస్తున్నారని ఆయన ఫైరయ్యారు. 

తనను దత్తపుత్రుడు అని విమర్శిస్తే మిమ్మల్ని కూడా సీబీఐ (cbi) దత్తపుత్రుడని అంటాంటూ పవన్ హెచ్చరించారు. దత్తపుత్రుడు అని వారి నోటి నుంచి వస్తే సీబీఐ దత్తపుత్రుడని ఫిక్స్ అవుతామన్నారు. చంచల్‌గూడలో షటిల్ ఆడుకున్న మీరు నాకు చెబుతారా అంటూ పవన్ ఫైరయ్యారు. సొంతవారు వున్నప్పుడు ఎవరైనా ఎందుకు దత్తతకు వెళ్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాను మీకంటే బాగా స్క్రీన్‌ ప్లే రాయగలనని.. సీఎం పదవికి తాను గౌరవం ఇస్తున్నానని, అందుకే మీరు అని అంటున్నానని పవన్ వ్యాఖ్యానించారు. 

కౌలు రైతుల్ని ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా జనసేన గుర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అహంకారంతో విర్రవీగితే ఎలా వ్యవహరించాలో తనకు తెలుసునని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తన సభలకు వచ్చిన యువత వైసీపీని నమ్మిందని.. వైసీపీ నేతలు పేదల కన్నీళ్లు తుడవలేకపోతే తాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పన్నులతో వచ్చిన నిధుల్ని మీరు ఇస్తున్నట్లు చెప్పడం ఏంటని పవన్ ప్రశ్నించారు. ప్రతి సమస్యా మీ వల్లే వచ్చిందని తాను వైసీపీని అనడం లేదని.. విజయవాడ అత్యాచార (vijayawada gang rape) ఘటన విషయంలో తాను పోలీసుల్ని ఏమి అనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

పోలీస్ వ్యవస్థ కూడా విసుగెత్తి పోయిందన్నారు. అభివృద్ది అంటే బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లు అమ్మడమా అని పవన్ ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి 40 మంది వరకు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఘోరంగా పాలన చేస్తోందని విమర్శించారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన ప్రభుత్వం మద్యం షాపుల్ని ఎలా తెరుస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. సమస్యకు పరిష్కారం చెప్పకుండా తాను మాట్లాడనని.. వైసీపీ నేతలకు సంస్కారం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.