అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులపాలనపై నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఏకంగా జగన్ ప్రభుత్వం 6నెలల పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

జగన్ ఆరు నెలల పాలనలో విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం తప్ప ప్రజలకు ఉపయోగడపే కార్యక్రమాలు ఏమీ చేయలేదంటూ ధ్వజమెత్తారు. మానసిక ఆవేదన, అనిశ్చితి, విచ్చిన్నం అంటూ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలను నెలకు ఒక్కొక్కటిగా వివరిస్తూ ఒక్కో అంశంపై ఘాటైన విమర్శలే చేశారు పవన్ కళ్యాణ్. ఆరు అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని విరుచుకుపడ్డారు. 

 

పవన్ విమర్శించిన అంశాల్లో మెుదటిది విధ్వంసం: జగన్ అధికారంలోకి వచ్చిన మెుదటి నెలలోనే కూల్చివేత పర్వాలు, ఉద్దేశ్యపూర్వకంగా వరదనీటితో రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారంటూ దుమ్మెత్తిపోశారు. 

ఇకపోతే రెండో అంశంగా దుందుడుకుతనం: తెలుగు ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, పీపీఏల రద్దు, అమరావతి నిర్మాణం నిలుపుదల, జపాన్ రాయబారి - సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు, ఆర్బిట్రేషన్లు ఈ పరిణామాలన్నింటికి జగన్ ప్రభుత్వం దుందుడుకుతనం వల్లే జరిగాయని ఆరోపించారు. 

ఇకపోతే మూడో అంశం కక్ష సాధింపుతనం: జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించిందని పవన్ ఆరోపించారు. శ్రీకాకుళంలోని సామాన్య కార్యకర్తతో మొదలుకొని, పోలీసు వేధింపులు, జనసేన ఎమ్మెల్యే రాపాక మీద కేసులు బనాయించడం, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ఉరి వేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికివేయడం వంటి పరిణామాలు కక్ష సాధింపులో భాగమేనన్నారు. 

 

అలాగే న్యూస్ ఛానెల్స్ బ్యాన్ చేయడం, జర్నలిస్టులకు చట్టాల ముసుగులో సంకెళ్లు వేయడం, దుర్గి మండలంలో ఊళ్లు ఊళ్లు మగాళ్లు లేకుండా ఖాళీ చేయడం, వైసీపీకి ఓటు వెయ్యని ప్రజలను బెదిరించడం, భయపెట్టడం, రహదార్లు మూసేయ్యడం, సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేస్తే కేసులు పెట్టి వేధించడం, ఊళ్లలో భయానక వాతావరణం సృష్టించడం ఇవన్నీ కక్ష పూరిత ధోరణిలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు.  

ఇకపోతే నాలుగో అంశం మానసిక వేదన: 5లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 2లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టారంటూ ధ్వజమెత్తారు. 

 

27 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జగన్ ప్రభుత్వ హయాంలో వలస వెళ్లిపోయారన్నారు. ప్రభుత్వ విధానం వల్ల లక్షా 65 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ గాలిలో కలిసిపోయిందని ప్రశ్నించారు. 90 వేలు పైచిలుకు ఉన్న తెలుగు టీచర్లలో ఆందోళన కలిగిస్తున్నారని ఆరోపించారు. 

ఆంగ్ల మాధ్యమం పేరు మీద ఆంగ్లం రాకపోతే వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లాగా కొత్తవారిని పెట్టుకుంటారనే భయాలు, స్థానిక వ్యాపార వేత్తలు, కులాల వారీగా వేధింపులు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయేలా దాడులు చేయడంతో ప్రజలు మానసిక ఆందోళనలో ఉన్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడంతో పెట్టుబడులు ఆంధ్రకి ఇంక రావు, ఫలితంగా  ఉద్యోగ అవకాశాలు ఉండవని నిరుద్యోగుల్లో నిస్సహాయత నెలకొందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

ఇక ఐదో అంశంగా అనిశ్చితి : ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధాని ఉంటుందా ? కేంద్రం ఏపికి నిధులు ఇస్తుందా ? నవరత్నాలకు నిధులు ఉన్నాయా ? ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతభత్యాలకు డబ్బులున్నాయా ? 40 వేల కోట్లు ఉన్న అప్పు, పెట్టుబడులు లేవు పెట్టినవి పంపేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటీ ? అన్న అనిశ్చిత రాష్ట్ర ప్రజల్లో నెలకొందన్నారు.  

ఇక ఆరో అంశంగా విచ్ఛిన్నం : ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాషని, సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నతికి శ్రీకారం చుట్టారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకుందాం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా కోరారు. 

 

ఇకపోతే జగన్ ప్రభుత్వానికి సంబంధించి 100 రోజులపాలనపై పవన్ కళ్యాణ్ ఏకంగా పుస్తకమే రిలీజ్ చేశారు. ఆర్నెళ్లపాలన విషయానికి వచ్చేసరికి అంశాల వారీగా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్.

జగన్ ప్రభుత్వం ఆర్నెళ్లపాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రోగ్రెస్ రిపోర్ట్ పై వైసీపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందోనన్నది వేచి చూడాలి. జగన్ విమర్శలను స్వీకరిస్తుందా లేక వివరణ ఇస్తూ ఎదురుదాడికి దిగుతుందా అన్న అంశంపై సస్పెన్షన్ నెలకొంది. 

ఈ వార్తలు కూడా చదవండి

బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల భేటీ: పవన్ కల్యాణ్ కు మద్దతు