హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా, తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించే వారికి మద్దతు పలకాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పిలుపునిచ్చారు. ఒక రాజకీయ పార్టీగా మాతృ భాష విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో మిగిలిన పార్టీలు కూడా ఆయన్ను అనుసరిస్తే భాషకు మహోపకారం చేసిన వారిమవుతామన్నారు. 

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత  జొన్నవిత్తుల రామలింగేశ్వరావుతో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. తెలుగు భాషా పరిరక్షణకు చేపట్టిన మన నుడి - మన నది కార్యక్రమానికి మద్దతు తెలిపారు. తెలుగు భాషతోపాటు నదీ పరిరక్షణకు చేపట్టాల్సిన పలు అంశాలపై శ్రీ పవన్ కళ్యాణ్ తో చర్చించారు. 

అనంతరం శ్రీ బుద్దప్రసాద్ మాట్లాడుతూ... "పవన్ కళ్యాణ్ తెలుగు భాష పరిరక్షణ కోసం నడుంకట్టిన సందర్భంలో మన నుడి - మన నది కార్యక్రమాన్ని ప్రారంభించి తెలుగు భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సమయంలో ఓ తెలుగు భాషాభిమానిగా వారిని హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది" అని అన్నారు. 

"ఆంగ్ల మాధ్యమం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమగ్రమైన తెలుగు వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. భాషతో ఏర్పడిన జాతి తెలుగు జాతి. భాష ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుందన్న విషయాన్ని గుర్తించి మన భాషను కాపాడుకోవడానికి ముందుకు వచ్చినందుకు సంతోషం" అని మండలి అన్నారు. 

"తెలుగు భాష మనుగడ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించింది. ఈ సవాలును మనం ధీటుగా ఎదుర్కొని జాతిని మేల్కొలిపి, భాషను సంరక్షించుకుని, జాతిని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అదే ఆలోచనను పవన్ కళ్యాణ్ వివరించారు" అని చెప్పారు.  

"ఒక భాషాభిమానిగా ఆయనకు నా వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా. తెలుగు భాష అభిమానులంతా ఒక సమైక్య వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. "శ్రీ పవన్ కళ్యాణ్ తో భాషాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించాం. ఆయన ఒక బలమైన సంకల్పంతో తెలుగు భాష పరిరక్షణ, నదుల కాలుష్యాన్ని నివారించేందుకు కంకణం కట్టుకున్నారు" అని అన్నారు. 

"అందుకు అన్ని వర్గాల వారు, ప్రకృతి ప్రేమికులు, భాషా ప్రేమికులు, పండితులు, కవులు కలసి రావాలని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుండి అందరితో కలసి ఉద్యమిస్తానని పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు ప్రతిస్పందనగా ఆయన్ని కలవడం జరిగింది" అని అన్నారు. 

"నదీ పర్యావరణ పరిరక్షణ, భాషా పరిరక్షణ కార్యక్రమాలపై  ఆంగ్ల మాధ్యమంలో జాతి కొట్టుకుపోకుండా తెలుగు భాషతో పాటు ఆంగ్ల భాషను మన విద్యార్ధులకు అందించడం ఎలా? తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవడం ఎలా? దీనికి మనవంతు మనం చేయాల్సింది ఏమిటి? అనే అంశాల మీద చర్చ జరిగింది" అని చెప్పారు. 

"పవన్ కళ్యాణ్ తీసుకున్న నదీ పరిరక్షణ-భాషా పరిరక్షణ ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ఈ అంశంలో నిరంతరం ఆయనతో కలసి నా శక్తి సామర్ధ్యాల మేరకు ఆయన విజయానికి సహకరిస్తాను. పండితులు, కవులు తరలివచ్చి భాషా పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపాలి" అని జొన్నవిత్తుల అన్నారు.