జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయంగా పనులు వేగవంతం చేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో పర్యటించిన ఆయన ప్రస్తుతం ఒంగోలు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని పవన్ పరామర్శించారు.

జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి పవన్ ఐదులక్షల ఆర్థిక సహాయం కూడా అందించారు. కాగా.. ఈ రోజు 11గంటలకు వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై ఎస్పీకి జనసేన అధినేత ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం 12 గంటలకు మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు.

బేస్తవారపేట మండలం సింగన్నపల్లి గ్రామంలో శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు వాహనానికి  జనసేన కార్యకర్త వెంగయ్య, మరికొంత మందితో కలిసి ఎదురెళ్లారు. ‘‘ఇళ్ల స్థలాలతో పాటు.. మా ఊరు రోడ్డు సమస్య ఎందుకు పరిష్కరించలేదు? ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి? అభివృద్ధి పనులు పట్టవా?’’ అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రాంబాబు కారులో నుంచే.. తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ‘‘ముందు ఆ మెడలో టవల్‌ తీసేయ్‌.. మెడలో ఒక పార్టీ కండువా వేసుకొని, నలుగురు తాగుబోతుల ను పక్కన పెట్టుకొని వచ్చి ప్రశ్నిస్తే మేము చెప్పాలా’’ అంటూ హెచ్చరిక ధోరణలో మాట్లాడారు. దీంతో వైసీపీ నేతలు.. జనసేన కార్యకర్తకు సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  కాగా ఈ ఘటన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన వెంగయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.