విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలను శిక్షించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధాని నుంచి తరలించాలనుకోవడం సరికాదన్నారు. 

కర్నూలు రాజధానిని వదులుకుని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వం ప్రజలతో ఆటలాడుకుంటుందని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలతో పూర్తి స్థాయి అధికారంలోకి వస్తే చక్కగా పరిపాలించాల్సిన జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూలగొడదామా...? ఏది నాశనం చేద్దామా అన్న ఆలోచనే తప్ప ఇంకేమీ చేయడం లేదన్నారు. ఇసుకతో జగన్ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకతో ఆటలాడుకుంటే ఏం  జరిగిందో చూశామని అలాంటి పరిస్థితి జగన్ ప్రభుత్వానికి వస్తుందేమోనని చెప్పుకొచ్చారు. 

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఆ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రజలకు అండగా ఉండేలా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. రాజధానిపై కులం రంగు పులమడం దురదృష్టకరమన్నారు. కులం రంగు పులిమి రాజధానిని తరలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రజల కంట కన్నీరు పెడితే ఆ ప్రభుత్వం మనుగడ సాధించుకోలేదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. అలాంటి పరిస్థితి వైసీపీ తెచ్చుకోవద్దన్నారు.