వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి పల్లకీనో మోసేందుకు సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. 

ఎవరి పల్లకీలు మోసేందుకు తాము లేమంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కౌలు రైతులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. వీళ్లు చేసిన విధ్వంసానికి ఓట్లు అడిగే అర్హత లేదని.. తనకు అనుభవం లేదని మాట్లాడొద్దని పవన్ హెచ్చరించారు. 2007 నుంచి రాజకీయాల్లో వున్నానని.. అనుభవజ్ఞులతో తిరిగానని ఆయన గుర్తుచేశారు. ఎలాంటి పరిస్దితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండే మాట్లాడుతున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జనసేన వ్యతిరేకిస్తుందని.. కార్మికులకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. బలమైన పాలనా వ్యవస్థ వుంటే నేరాలు చేసేవారు భయపడుతారని అభిప్రాయపడ్డారు. బ్యూరోక్రసీ బలంగా వుండకపోతే తీవ్రనష్టం జరుగుతుందంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం (ysrcp govt)పై విమర్శలు గుప్పించారు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) . వైసీపీ నేతలు తమ అరాచకాలతో రాష్ట్రాన్ని శ్రీలంకలా (srilanka crisis) మారుస్తున్నారని మండిపడ్డారు. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోవద్దని అన్నానని ఆయన గుర్తుచేశారు. జనసైనికులకు నేనేంటో బాగా తెలుసునని పవన్ వ్యాఖ్యానించారు. 

తామంటే ఎందుకంత భయమన్న ఆయన.. తాను లేని సమస్యను ఎప్పుడైనా మాట్లాడానా అని ప్రశ్నించారు. మద్యాన్ని నిషేధిస్తామని (liquor sales in ap) చెప్పి ప్రత్యేక రేట్లకు ఎలా అమ్ముతారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రేట్లు పెంచితే తాగరంటూ తప్పుడు లాజిక్ చెబుతారంటూ సెటైర్లు వేశారు. చెత్త పన్ను పెంచారని.. కౌలు రైతులు చనిపోయే పరిస్థితి తెచ్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన విద్యార్ధులు విదేశాలకు వెళ్లి చదివే పథకాన్ని తీసేశారని పవన్ ఫైరయ్యారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 353 మంది కౌలు రైతులు చనిపోయారని.. వారికి ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్యమం చేస్తామని జనసేనాని స్పష్టం చేశారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది అని భావిస్తున్నానని పవన్ అన్నారు. రాష్ట్రం శాంతిభద్రతల విషయంలో ఆరో స్థానంలో ఉందని.. వైసిపి నాయకులు అరాచకాల వల్లే క్రైం పెరిగిందని ఆయన ఆరోపించారు. పేకాట క్లబ్ లు, డ్యాన్స్ లు చేయిస్తే... గొడవలు జరగవా అని పవన్ ప్రశ్నించారు. క్రైం రేటు పెరిగితే... పాలనా వ్యవస్థ సక్రమంగా లేదని అర్ధమన్నారు. ఐ.ఎ.యస్ లు, ఐపీయస్‌ లు వంగి పని చేయకుండా చట్టపరంగా నడుచుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. పెట్రోల్, గ్యాస్ ధరల పై కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగ్గించాలని కోరతామని చెప్పారు. 

సగటు మనిషి తట్టుకోలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. పొత్తులో ఉన్నాం కదా అని ప్రజల సమస్యలు ప్రస్తావన చేయకుండా ఉండనని పవన్ స్పష్టం చేశారు. ఇందులో విపరీత అర్ధాలు వెతకాల్సిన అవసరం లేదని చురకలు వేశారు. పొత్తులో ఉన్నా వంద శాతం ఏకాభిప్రాయం ఉండదు.. అభ్యంతరాలు తప్పకుండా చెబుతానని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో జనసేన తరపున ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అక్కడ ధైర్యం లేక సంకోచిస్తున్నారని తానే వచ్చి కూర్చుంటానని ఆయన అన్నారు. ఎన్నికలు ముందొచ్చినా అందరం సిద్దంగా ఉందామని శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. 

పుట్టని మనవళ్లు, ముని మనవళ్ల కోసం కోట్లు కూడపెడుతున్నారని ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారని.. ఉపాధి లేక యువత గంజాయి సాగు వైపు వెళ్లిపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పిస్తే ఇటువంటి అసాంఘిక కార్యక్రమం ఆగుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతే రాజధాని అని జనసేన తరపున ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు. విశాఖ, తిరుపతి, కర్నూలు నగరాలను ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేయాలని పవన్ డిమాండ్ చేశారు. 

ఒక కంపెనీకి ఇసుకను ఇచ్చి దోపిడీ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే తెల్లకార్డు ఉన్నవారందరికీ ఇసుక ఉచితమని పవన్ హామీ ఇచ్చారు. యువతకు పది లక్షల రూపాయల రుణం ఇప్పిస్తే... ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కౌలు రైతుకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని.. ఐదు వందల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి ఎక్కువ అప్పులు చేసినా... అవి తీర్చే ప్రణాళికలు మనం సిద్దం చేసుకోవాలని, జనసేన ప్రభుత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన రైతు భరోసా యాత్ర పేరుతో రైతులకు ఆర్ధిక సాయం అందిస్తామని పవన్ పేర్కొన్నారు.