తెలుగుదేశం పార్టీ నేతలను సీఎంలు చేయడానికి జనసేన లేదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన డివిజన్, మండల స్థాయి నేతలతో పవన్ సమావేశమయ్యారు.
తెలుగుదేశం పార్టీ నేతలను సీఎంలు చేయడానికి జనసేన లేదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన డివిజన్, మండల స్థాయి నేతలతో పవన్ సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన పని అన్న పవన్ కల్యాణ్.. తాను కొందరికి శత్రువునయ్యేందుకు రెడీగా వున్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ మాత్రమే వుండేదని.. అప్పటి రాజకీయ పరిస్థితులు వేరని ఆయన అన్నారు. ఒక వ్యక్తికి పాపులారిటీ వున్నంత మాత్రాన రాత్రికి రాత్రి అధికారం వచ్చేయదని పవన్ గుర్తుచేశారు. ఎన్టీఆర్‌కు జరిగిందేమో కానీ.. తనకు జరుగుతుందని కలలో కూడా ఊహించలేనని పవన్ తేల్చేశారు. అందుకే తాను పాతిక సంవత్సరాలు అనే మాట మాట్లాడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో కనీసం 45 నుంచి 50 స్థానాలు గెలిచి వుంటే సీఎం పదవి గురించి అడగటానికి వీలుండేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఓట్లు వేసి మాట్లాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019లో జనసేన 134 స్థానాల్లో పోటీ చేసిందని.. కానీ మాయ చేసిన వాళ్లనే నమ్మారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ సారి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమ్మకం అనేది ఒక రోజులో సంపాదించలేమని.. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానంతో ఎంఐఎం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోందని పవన్ గుర్తుచేశారు.
ఐదేళ్లు చాలా విలువైన కాలమన్న ఆయన.. తనను ఒక కులానికి పరిమితం చేయొద్దని కోరారు. ఇంతటి జనాదరణ వున్న మనకు సీట్లు ఎందుకు రావడం లేదని పవన్ ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులను ముఖ్యమంత్రులను చేయడానికి జనసేన లేదని ఆయన స్పష్టం చేశారు. కష్టాల్లో వున్నప్పుడు మాత్రమే పవన్ గుర్తొస్తాడని.. ఎన్నికలప్పుడు గుర్తుకురాడని జనసేనాని చురకలంటించారు. మనం ఎంత బలం వుందో బేరీజు వేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
మనకున్న ప్రజాశక్తిని ఓట్లుగా మార్చుకోవాలని.. కర్ణాటక వెళ్లినా ఇంతకు మించి జనసందోహం వస్తుందన్నారు. 2009లో పీఆర్పీకి వచ్చిన సీట్లు కూడా రాలేదని, ఎంఐఎంలా కాదు.. కనీసం విజయ్ కాంత్ పార్టీలా కూడా గౌరవించలేదే అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడగానే వైసీపీ బుడతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ సెటైర్లు వేశారు. అవసరమైనప్పుడు తగ్గడమే కాదు.. అవసరమైనప్పుడు బెబ్బులిలా పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. భీమ్లా నాయక్ సినిమా వల్ల రూ.30 కోట్లు నష్టమొచ్చిందని.. వైసీపీ నాయకులకేమో వేలకు వేల కోట్లు, కాంట్రాక్టులు, ఇసుక దోపిడీలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి వాళ్ల వెంట ఎందుకు నడుస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
