విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 11 మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాదం బారినపడటం అత్యంత విషాదకరమన్నారు.

''విజయవాడ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను'' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

''రమేశ్ హాస్పిటల్స్ కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు ఏమిటో సమగ్ర విచారణ చేయించాలి. ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలి'' అని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. 

read more   విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం... సీఎం జగన్ కు ప్రధాని ఫోన్

విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్ లో 40మంది కరోనా పేషంట్స్ తో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్ లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి  చేశాయి. దీంతో వారు కిటీకీల వద్దకు చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. 

 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ప్రమాదంలో మరింత అస్వస్ధతకు గురయిన పేషెంట్స్ ఇతర కోవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 11మంది మృత్యువాతపడగా చాలామంది తీవ్ర అస్వస్ధతకు గురయినట్లు తెలుస్తోంది. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ  అగ్నిప్రమాదం చోటుచేసుకుని వుంటుందని... మంటలను ఎవ్వరూ గమనించకపోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ దుర్ఘటనపై దేశ ప్రదాని మోది, ఏపి గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, సీఎం జగన్, ప్రతిపక్ష  నేత చంద్రబాబు కూడా స్పందించారు.