విశాఖపట్నంలో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో చోటుచేసుకున్న ప్రమాదం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన  వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు పవన్ కల్యాణ్. 

పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేరిట జనసేన విడుదల చేసిన ప్రకటన... యధావిదిగా 

 విశాఖ జిల్లా గాజువాక, పరవాడ కేంద్రాలుగా విస్తరించి ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్.జి.పాలిమర్స్, సాయినార్ ఫార్మా ప్రమాదాలు మరవక ముందే రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో నిన్న అర్ధరాత్రి సంభవించిన ప్రమాదం భయబ్రాంతులకు గురి చేసింది. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు? ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు? వంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి 

విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో  ప్రమాదకరమైన, మండే స్వభావం గల ఆయిల్స్, రసాయనాలు నిల్వ చేస్తున్నప్పుడు రక్షణ ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలి కదా? రక్షణ ఏర్పాట్లు ఉంటే ఈ పేలుడు ఎందుకు సంభవించిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసిన అవసరం వుంది. సి.ఈ.టి.పి.. పరిధిలో ప్రమాదం జరిగిన పరిశ్రమను నిర్వహిస్తున్నారు అని వెలువడుతున్న వార్తలపై ఫార్మాసిటీ నిర్వాహకులు, ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా వివరణ ఇవ్వాలి. కర్మాగారంలో సంభవించిన పేలుడు పది కిలోమీటర్ల వరకు వినిపించిందంటే దాని స్థాయి మనం  ఊహించవచ్చు. అగ్ని కీలలను అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడవలసి వచ్చిందంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. 

పేలుడులో  ఒకరు మృతి చెందారని, ఆరుగురు  కార్మికులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిసి చాల ఆవేదన కలిగింది. కర్మాగారం ఆవరణలో కాలిన తీవ్ర గాయాలతో కనిపించిన మృతదేహం గత అర్ధరాత్రి నుంచి కనిపించకుండాపోయిన సీనియర్ కెమిస్ట్ శ్రీ కె.శ్రీనివాస్ అని తోటి వారు చెబుతున్నారు. మృతుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయిన  శ్రీ మల్లేష్ కు  మెరుగైన వైద్య సహాయం అందచేయాలి.

ఈ ప్రమాద ఘటనపై విశాఖలోని జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివ శంకర్ తో మాట్లాడాను. బాధితులకు అండగా వుండవలసిందిగా కోరాను. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే సహాయ కార్యక్రమాలలో పాల్గొనడానికి జనసైనికులు తరలి వెళ్లారని ఆయన చెప్పారు. మృతుని కుటుంబానికి, గాయపడినవారికి  సంతృప్తికరమైన రీతిలో పరిహారం ఇవ్వాలి. వారికి పరిహారం అందే వరకు స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రమాదంపై ప్రభుత్వం క్షుణ్ణంగా విచారణ జరపాలి. ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.