అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీని కలుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.శుక్రవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

also read:ఆందోళనలు చేస్తే ప్రైవేటీకరణ ఆగదు: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సుజనా చౌదరి

ఈ ఆందోళనల నేపథ్యంలో జనసేన స్పందించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు,.విశాఖ ఉక్కును కాపాడుకొంటామని ఆయన తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 32 మంది ప్రాణాలు పోగొట్టుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఇందరి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారికి ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం జనసేన తన వంతు ప్రయత్నం  చేస్తోందన్నారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వివరిస్తామన్నారు. ఈ మేరకు జనసేన తరపున  ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహార్ ఈ విషయాన్ని ప్రకటించారు.