వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి .. ఆ జీవో ఒక్కటే మిగిలుంది : మల్లవరం ఘటనపై పవన్ ఫైర్
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరంలో బాణావత్ సామునిబాయి అనే మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి అనే జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి వుందంటూ పవన్ ఎద్దేవా చేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరంలో బాణావత్ సామునిబాయి అనే మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్ధితి రావడం దురదృష్టకరమన్నారు. తాగునీరు పట్టుకునేందుకు ఆమె ట్యాంకర్ వద్దకు వెళ్లడం, ఇంట్లో తాగేందుకు నీళ్లు లేవని ప్రాధేయపడినా అవతలి పార్టీ వారు అడ్డుకుని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి రాష్ట్రంలో ఎలాంటి పాలన వుందో అర్ధం చేసుకోవాలన్నారు.
వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి అనే జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి వుందంటూ పవన్ ఎద్దేవా చేశారు. పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే పరిస్ధితి వుందన్నారు. మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ జగన్ మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు...అతని అనుచరులేమో ఎస్సీలను చంపించి డోర్ డెలివరీ చేస్తారు, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించి చంపేస్తారు ’’ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.