Hanuma Vihari : మిస్టర్ జగన్ రెడ్డి ... తెలుగు క్రికెటర్ కంటే కార్పోరేటరే ఎక్కువయ్యాడా..?: పవన్ కల్యాణ్
టీమిండియా క్రికెెటర్, ఆంధ్ర రంజీ ప్లేయర్ హనుమ విహారి వ్యవహారంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటూ సీరియస్ ట్వీట్ చేస్తూ దాన్ని జై షా కు ట్యాగ్ చేసారు.
అమరావతి : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై తెలుగు యువ క్రికెటర్ హనుమ విహారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ నుండి తనను తప్పించడానికి ఓ రాజకీయ నాయకుడే కారణమని ... అతడి కొడుకు కోసమే తనను బలిచేసాడని విహారీ ఆరోపించారు. తనకు జరిగిన అవమానాన్ని భరించలేకపోతున్నాను... కాబట్టి ఇకపై ఆంధ్ర జట్టు తరపున ఆడబోనని విహారి ప్రకటించారు. ఇలా హనుమ విహారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకుని అధికార వైసిపిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హనుమ విహారి వ్యవహారంపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. ''భారత్ తరపున అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులు ఆడిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి. అతడు 16 టెస్ట్ మ్యాచులాడి ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా అతడు ఆస్ట్రేలియా జట్టుపై సిడ్నిలో చేసిన వీరోచిత పోరాటం ఎన్నటికీ మరిచిపోలేనిది'' అని పవన్ కొనియాడారు.
''ఇక ఆంధ్ర ప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ గా విహారికి మంచి రికార్డ్ వుంది. ఆంధ్రా టీమ్ గత ఏడేళ్లలో ఐదుసార్లు నాకౌట్ కు అర్హత సాధించడంతో విహారీ పాత్ర ఎంతో వుంది. చేయి విరిగినా,మోకాలికి గాయమైనా పట్టించుకోకుండా జట్టు ప్రయోజనాలకోసం ఆడాడు. ఇలా తన సర్వస్వాన్ని భారత జట్టు, ఆంధ్ర క్రికెట్ కోసం ధారపోసిన గొప్ప ఆటగాడు హనుమ విహారి. అలాంటి ఆటగాడిని కేవలం అధికార వైసిపి కార్పోరేటర్ కోసం రాజీనామా చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒత్తిడిచేయడం దారుణం. అంటే భారత జట్టుకు ఆడిన ఆటగాడు, రాష్ట్ర రంజీ ప్లేయర్ కంటే అసలు క్రీడలతో సంబంధమే లేని వైసిపి నాయకుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ఎక్కువయ్యాడు... సిగ్గుచేటు!'' అని పవన్ మండిపడ్డారు.
Also Read క్రీడలపై వైసీపీ క్రీనీడలు.. ఆడుదాం ఆంధ్ర అంటూ 2 నెలలు సినిమా స్టంట్స్ - వైఎస్ షర్మిల
''మిస్టర్ జగన్మోహన్ రెడ్డి... రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ఆటగాడిని దారుణంగా అవమానించడం, వేధించడం చేస్తుంటే... 'ఆడుదాం ఆంధ్ర' వంటి కార్యక్రమాలను ఎన్ని కోట్లు ఖర్చుచేసి నిర్వహించినా లాభమేంటి?'' అని పవన్ ప్రశ్నించారు.
''ప్రియమైన హనుమ విహారి గారు... మీరు దేశానికి, రాష్ట్రానికి దక్కిన ఛాంపియన్ ప్లేయర్. రాష్ట్రానికి చెందిన యువతకు, ఆటగాళ్లకు మీరు ఆ స్పూర్తిగా నిలుస్తున్నారు... మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు. మీ పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహరించిన తీరు క్రికెట్ ను ప్రేమించే తెలుగు ప్రజలందరినీ ఎంతో బాధించింది. మీకు మద్దతుగా మేమందరం నిలబడతాం'' అని పవన్ ప్రకటించారు.
''చివరగా ఒక్కమాట చెబుతున్నా. వచ్చే ఏడాది ఆటగాళ్లకు గౌరవిస్తూ, మర్యాదగా వ్యవహరిస్తూ హుందాగా వుండే బోర్డు పర్యవేక్షణలో మీరు మళ్లీ ఆంధ్ర జట్టు తరపున ఆడాలని కోరుకుంటున్నా. మీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని పవన్ అన్నారు. ఇలా ఎక్స్(ట్విట్టర్) వేదికన హనుమ విహారి వ్యవహారంపై ట్వీట్ చేసిన పవన్ బిసిసిఐ, భారత క్రీడా విభాగాలతో పాటు జై షా కు ట్యాగ్ చేసారు.