Asianet News TeluguAsianet News Telugu

పెన్షన్ పెంచి.. లబ్ధిదారులను తగ్గిస్తారా, రూ.3 వేల పింఛన్ హామీ ఇలాగేనా : జగన్‌కు పవన్ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పింఛన్‌దారుల తొలగింపును విరమించుకోవాలని సీఎంను కోరారు పవన్ . పెన్షన్ మొత్తం పెంచుతున్నారు కాబట్టి లబ్ధిదారులను తగ్గిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 

janasena chief pawan kalyan open letter to ap cm ys jagan over pension issues
Author
First Published Dec 28, 2022, 5:52 PM IST

రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 4 లక్షల మందికి పెన్షన్లను ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. పెన్షన్లు ఇవ్వకుండా ఉండటానికి నోటీసులు ఇచ్చారని పవన్ కల్యాణ్ నిలదీశారు. పింఛన్లను తొలగించడానికి కారణాలు సహేతుకంగా లేవన్న ఆయన.. జగన్‌కు రాసిన లేఖలో పెన్షన్లు తొలగించిన వారి వివరాలను పేర్కొన్నారు పవన్ . అవ్వా, తాతలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామన్న మీ హామీ ఇలా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. పెన్షన్ మొత్తం పెంచుతున్నారు కాబట్టి లబ్ధిదారులను తగ్గిస్తారా అని పవన్ నిలదీశారు. ఆర్ధిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే పెన్షన్ల తొలగింపా అని ఆయన ప్రశ్నించారు. పింఛన్‌దారుల తొలగింపును విరమించుకోవాలని సీఎంను కోరారు పవన్ . 

ఇదిలావుండగా... పెన్షన్లను తొలగిస్తారని  తప్పుడు  ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్  పేర్కొన్నారు. అర్హులకు పెన్షన్లు అందించాలనే ఉద్దేశ్యంతోనే కొందరికి నోటీసులు జారీ చేసినట్టుగా   జగన్  తెలిపారు.అర్హులైన లబ్దిదారులకు   ఏదైనా కారణంతో  ప్రభుత్వ పథకాలు అందని వారికి  మంగళవారంనాడు  నిధులు విడుదల చేశారు సీఎం జగన్. రాష్ట్రంలోని  2,79,065 మందికి  రూ. 590.91 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా  వీడియో కాన్పరెన్స్ ద్వారా లబ్దిదారులతో  జగన్  మాట్లాడారు.

ALso REad: పెన్షన్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారం: రూ. 590 కోట్లను విడుదల చేసిన జగన్

నోటీసులు ఇస్తేనే  పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.ప్రభుత్వానికి  అందిన సమాచారం ఆధారంగా  కొందరికి నోటీసులు  జారీ చేసినట్టుగా  సీఎం జగన్ చెప్పారు. ఈ నోటీసులు అందిన  లబ్దిదారుల  నుండి  సమాధానం తీసుకుంటామన్నారు. ఈ సమాధానం తర్వాత రీ సర్వే  చేసిన అనంతరం చర్యలు తీసుకొంటామని  సీఎం తేల్చి చెప్పారు. అర్హులందరికి పెన్షన్లు  అందించాలనేది తమ ప్రభుత్వం ఉద్దేశ్యమన్నారు. పెన్షన్ ఒక్కటే కాదు ప్రభుత్వ పథకాలన్నింటిని కూడా  అర్హులకు  అందిస్తామన్నారు. అనర్హులకు  పథకాలు  దక్కకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం జగన్  స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయంలో  జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని  సీఎం జగన్ ఆరోపించారు. ఏ పథకం  రావాలన్న  జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిందేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్టుగా  సీఎం జగన్ చెప్పారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా  లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios