అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ.. రేపు కూడా జనసేనాని ఢిల్లీలో వుండే ఛాన్స్..?
ఢిల్లీ పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇతర అంశాలపై వీరిద్దరూ చర్చించే అవకాశం వుంది.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన వరుసగా బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే ఉదయం కేంద్ర మంత్రి మురళీధరన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. రేపు కూడా ఢిల్లీలోనే వుండి.. మరికొందరు పెద్దలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) సమావేశంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. ప్రధాని నరేంద్ర మోడీపై అభిమానం వ్యక్తం చేశారు. ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడం వల్ల దేశం సుస్థిరత దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో జనసేన అధినేత పాలుపంచుకోవడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏన్డీయే సమావేశంలో పాలు పంచుకోవడం గురించి ఒక లేఖను విడుదల చేస్తూ... అందులో పలు కీలక ప్రస్తావనలు చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిష్మాను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చూస్తోందని హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గత ఎన్నికల కంటే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపిన హరిరామ జోగయ్య.. ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చునని తెలిపారు. అలాగే, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. టీడీపీ పాలనలో జరిగిన కొన్ని విషయాలు జనసేనకు వ్యతిరేకంగా మారవచ్చునని తెలిపారు.
ALso Read: ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడం జనసేన విధానం కాదు.. : పవన్ కళ్యాణ్
నీతివంతమైన పరిపాలన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా, బీజేపీ, జనసేన కూటమికి ఉపయోగపడవచ్చు కానీ, రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చక పోవడం వల్ల బీజేపీకి సానుకూల పరిస్థితి లేదని తెలిపారు. మత రాజకీయాలను గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీకి మత రాజకీయాల వల్ల కూడా నష్టం కలగజేసే అవకాశం ఉందనీ, రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీతో జనసేన పొత్తు ఎంతవరకు లబ్ధి చేస్తుందని కాలమే చెప్పాలని పేర్కొన్నారు.
జనసేన, బీజేపీ పొత్తును గురించి కీలక వ్యాఖ్యలు చేస్తూ.. జనసేనకు జరిగేదేమీ లేదన్నారు. "జనసేనతో బీజేపీ పొత్తు జనసేనకు కంటే బీజేపీకే ఎక్కువ లాభం. చంద్రబాబు పరిపాలన దక్షిత, జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉంది. టీడీపీ హయంలో జరిగిన అవినీతి, రంగా హత్య వంటి అంశాలు జనసేనపై ఆ ప్రభావం పడే అవకాశం కూడా ఉందని" తెలిపారు.