ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం:చంద్రబాబుతో పవన్ భేటీ
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భేటీ అయ్యారు. కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించే అవకాశం లేకపోలేదు.
హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భేటీ అయ్యారు. కుప్పంలో చంద్రబాబునాయుడును పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాన్ని అప్పట్లో చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పరామర్శించారు.
వైసీపీ సర్కార్ తీరును జనసేన, టీడీపీ తీవ్రంగా తప్పుబట్టాయి.
మూడు రోజుల కుప్పం పర్యటనను ముగించుకొని చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు చేరుకున్నారు. కుప్పంలో చంద్రబాబునాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. జీవో నెంబర్ 1ని సాకుగా చూపి పోలీసులు చంద్రబాబు టూర్ కు ఆటంకాలు కల్పించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఏడాది అక్టోబర్ మాసంలో విశాఖపట్టణంలో జనసేన కార్యక్రమాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విశాఖలోని హోటల్ కే పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారు.శాంతి భద్రతల దృష్ట్యా సమావేశాలు నిర్వహించవద్దని అప్పట్లో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై పోలీసుల తీరును టీడీపీ తప్పుబట్టింది. విశాఖ నుండి విజయవాడకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పరామర్శించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రెండు పార్టీల నేతల మధ్య చర్చించే అవకాశం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఇద్దరు నేతలు ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకొంటామని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. టీడీపీ, జనసేన మధ్య పంబంధాలు మెరుగయ్యాయి. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతుంది. రెండు పార్టీల నేతల ప్రకటనలు,సమావేశాలు కూడా ఇదే రకమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో టీడీపీతో సీపీఐ కలిసి పనిచేస్తుంది.
also read:కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్: టీడీపీ చీఫ్ తో భేటీ కానున్న జనసేనాని
వైసీపీ, టీడీపీలకు తాము సమానదూరం పాటిస్తామనే అభిప్రాయాన్ని బీజేపీ వ్యక్తం చేసింది. బీజేపీ, జనసేనలు మిత్రపక్షంగా ఉన్నాయి. కానీ, ఈ రెండు పార్టీల మధ్య రోజు రోజుకి అగాధం పెరుగుతుంది. కానీ తమ మద్య మంచి సంబంధాలున్నాయని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు.