కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్: టీడీపీ చీఫ్ తో భేటీ కానున్న జనసేనాని
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అమరావతి: టీడీపీ చీప్ చంద్రబాబు ఇంటికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. రాజకీయ వర్గాలు ఈ భేటీని ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 1 ప్రకారంగా రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. తమ పార్టీ ప్రచార రథాలు , వాహానాలను పోలీసులు సీజ్ చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు ధర్నా కూడా దిగాడు. ఈ పరిణామాలపై చంద్రబాబునాయుడుతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.
గత ఏ)డాది అక్టోబర్ 18వ తేదీన విజయవాడలోని ఓ హోటల్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకొన్న తర్వాత విశాఖపట్టణం నుండి పవన్ కళ్యాణ్ నేరుగా అమరావతికి చేరుకున్నారు. బీజేపీ తీరుపై ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవసరమైతే తమ వ్యూహాన్ని మార్చుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. హైద్రాాబాద్ నుండి అమరావతికి చంద్రబాబుకు వస్త్తూ మార్గమధ్యలోని హోటల్ లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోట టీడీపీ, జనసేన, బీజేపీలు విడి విడిగా పోటీ చేయడం వల్లే వైసీపీ విజయం సాధించిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు కూటమిగా పోటీ చేసే అవకాశం కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ, టీడీపీకి తాము సమదూరం పాటిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన, టీడీపీ నేతల మధ్య అంతరం తగ్గుతూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై రెండు పార్టీల నేతల నుండి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఏపీలో ఏయే పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయనే విషయమై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
రాష్ట్రంలో బస్సు యాత్రకు పవన్ కళ్యాణ్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు వారాహి వాహనాన్ని కూడా జనసేనాని సిద్దం చేసుకున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుండి పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ సభల్లో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 ని తీసుకువచ్చింది. రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలపై నిషేధం విధించారు. విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ జీవోను తీసుకు వచ్చారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.