హైదరాబాద్‌: క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న జనసైనికుడు ఆకాంక్ష నెరవేర్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పాతకూటి బుడిగయ్యను  పవన్‌కళ్యాణ్‌ పరామర్శించారు. 

మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బుడిగయ్య, ఆయన కుటుంబ సభ్యులు పవన్‌ను కలిశారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. వైద్య ఖర్చుల నిమిత్తం లక్షరూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

తన అభిమాని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వినాయకుడి విగ్రహాన్ని బుడిగయ్య కుటుంబ సభ్యులకు బహూకరించారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం గ్రామానికి చెందిన బుడిగయ్య పవన్‌ కళ్యాణ్ కు వీరాభిమాని. 

గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. కీమో థెరపీ తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

ఎన్నికల అనంతరం వ్యాధి తీవ్రత ఎక్కువవ్వడంతో మంచానికే పరిమితమయ్యారు బుడిగయ్య. అయితే తన అభిమాన నటుడు, నాయకుడు పవన్‌ కళ్యాణ్ ను చూడాలని తన కోరికను జనసేన పార్టీ నాయకులకు తెలియజేశారు. 

బుడిగయ్య ఆకాంక్షను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు పార్టీ కార్యకర్తలు. బుడిగయ్య క్యాన్సర్ సమస్యను విన్న పవన్ కళ్యాణ్ తానే అన్నసముద్రం వస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇంతలోనే అతడ్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో హైదరాబాద్ కు తీసుకువచ్చారు.  

అంబులెన్స్ లోనే బుడిగయ్యను పలకరించారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బుడిగయ్య భార్యతోపాటు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రి వైద్యులతో తాను స్వయంగా మాట్లాడుతానని పవన్‌ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూడాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన వైద్యుడు గౌతమ్‌ను ఆదేశించారు.