విజయవాడ: నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. భారీగా అబిమానులు, ప్రజలు, జనసేన కార్యకర్తలు వెంటనాగా పవన్ రోడ్ షో సాగింది. ఇలా పామర్రు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన నీటమునిగి పాడయిపోయిన పంట పొలాలను పరిశీలించారు. 

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు, ఈదురుగాలులు రైతులను నట్టేట ముంచాయన్నారు. చేతికి అందివచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అండగా ఉండాలనే ఈ పర్యటన చేపడుతున్నట్లు పవన్ తెలిపారు. 

read more  నివర్ బాధితులకు అండగా... రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)

''నేను ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయాలనుకోవడం లేదు. ఓట్ల సమయంలోనే వచ్చి వెళ్లే వ్యక్తిని కాను. ఇప్పుడు ఎన్నికలు లేవు. ప్రజల బాధలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకే వచ్చాను'' అన్నారు. 

''కష్టించి పండించిన పంట మొత్తం దెబ్బ తింది. సొంత భూమి కలిగిన రైతులతో పాటే కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలి. రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాలి. కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళతా'' అని నష్టపోయిన రైతులకు పవన్ భరోసా ఇచ్చారు.