ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అమరాతిని రాజధానిగా ఉంచాలని ప్రతిపక్ష పార్టీలు, రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడు రాజధానులు ఖాయం చేసేసింది. పరిపాలన మొత్తం విశాఖ నుంచే సాగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా... ఈ మూడు రాజధానుల అంశంపై తాజాగా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి పార్టీ వినాశనానికే పునాది అని పవన్ పేర్కొన్నారు. 5కోట్ల మంది ఆంధ్రుల ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని... దానిని ఇక్కడి నుంచి కదిలించడం అసాధ్యమన్నారు. ఒకవేళ కాదు.. కాకూడదని కదిలించినా అది తాత్కాలికమే అవుతుందని చెప్పారు. మూడు రాజధానులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతుందని జోస్యం చెప్పారు. రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేమన్నారు.

Also Read ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ...

విశాఖపట్నం, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న రాజధానులు ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదని చెప్పారు. ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ లాభాపేక్ష కోసమే ఇలా చేస్తోందని మండిపడ్డారు.

ఎప్పటికైనా రాజధానిగా అమరావతే ఉంటుందని పవన్ పేర్కొన్నారు. బీజేపీ పెద్దలకు తనకు రాజధాని గురించి ఓ విషయం చెప్పారని ఆయన అన్నారు. రాజధానిగా అమరావతే ఉంటుందని తనకు బీజేపీ అధిష్టానం మాటిచ్చిందని చెప్పుకొచ్చారు.  రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు నిర్మంచడాన్ని తాను సమర్థిస్తున్నామని కానీ.. వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనసేన పార్టీ వ్యతిరేకమని చెప్పారు.

మూడు రాజధానుల అంశం ఆచరణీయం కాదని అభిప్రాయపడ్డారు. రాజధాని అంటే టీడీపీ, వైసీపీలకు ఆటలా మారిపోయిందని మండిపడ్డారు. రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే.. ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ వ్యాపారం చేయాలని అనుకుంటుందని ఆరోపించారు.