అమరావతి: ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లును మంగళవారం నాడు ప్రవేశపెట్టింది. శాసమండలిలో  మాత్రం సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టలేదు.

శాసనమండలిలో  ఏపీ ప్రభుత్వం  పాలనా వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే టీడీపీ సభ్యులు రూల్ 71 కింద  నోటీసు ఇచ్చారు.  ప్రభుత్వ విధానాన్ని  వ్యతిరేకిస్తూ టీడీపీ తీర్మాణం ప్రవేశపెట్టింది.  రూల్  71  కింద టీడీపీ సభ్యులు ఈ విషయమై చర్చకు పట్టుబడుతున్నారు. 

Also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్

శాసనమండలిలో అధికార వైసీపీ  వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. శాసనమండలిలో టీడీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. శాసనమండలిలో ఈ  బిల్లు గట్టెక్కేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఈ నెల 19వ తేదీన జరిగిన టీడీఎల్పీ సమావేశానికి  12 మంది ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ఇద్దరు మాత్రమే వ్యక్తిగత కారణాలతోనే  టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్సీలు ఎందుకు గైర్హాజరయ్యారో  మాత్రం స్పష్టమైన కారణాలను చెప్పలేదు. 

టీడీఎల్పీ సమావేశానికి హాజరైన  టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైసీపీపై బీద రవిచంద్రయాదవ్ ఆరోపణలు చేశారు. శాసనమండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. ఈ సభలో టీడీపీకి 28, వైసీపీకి 9, పీడీఎఫ్ ఐదుగురు, బీజేపీకి ఇద్దరు సభ్యులు, నామినేటేడ్ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు. స్వతంత్రులు  ముగ్గురు ఉన్నారు.  శాసనమండలిలో మూడు  ఖాళీలు ఉన్నాయి.