జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో వున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీకానున్నారు. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని పవన్ కల్యాణ్ కోరనున్నట్లు సమాచారం.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తమ పార్టీకి ఓట్లు ఎక్కువగా వున్నాయని జనసేన నేతలు లెక్కలు చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందా..? జనసేన పోటీ చేస్తుందా..? అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారని.. ఆ తర్వాతే అభ్యర్ధి విషయంలో స్పష్టత వస్తుందన్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మరికొంత మంది కీలక నేతలతో పవన్ సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. కానీ సాయంత్రం వరకు ఎటువంటి భేటీ జరగలేదు.

బీజేపీ భాగస్వామిగా.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని జనసేనాని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీట్లు పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నీడలో వ్యవహారాలు చక్కబెట్టాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.