Asianet News TeluguAsianet News Telugu

ఆ ఆలోచనే నన్ను జనసేనవైపు నడిపించింది: పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్

ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయాన్ని తీసుకురావలన్నదే తన సంకల్పమని పవన్ తెలిపారు. అయితే రాజకీయ పార్టీ నడపడం అంత సులువైన పని కాదని ఇటీవలే తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

janasena chief pawan kalyan gives clarity about his political entry
Author
Amaravathi, First Published Jul 30, 2019, 4:06 PM IST

గుంటూరు: జనసేన పార్టీ స్థాపించడానికి గోదావరి జిల్లాలే కారణమని స్పష్టం చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అమరావతిలో పార్టీ కార్యాలయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో తాగేందుకు స్వచ్చమైన తాగునీరు లేకపోవడం తనను బాధించిందని చెప్పుకొచ్చారు. 

ఉభయగోదావరి జిల్లాలలో ఎటువైపు చూసినా నీరు ఉంటుందని కానీ తాగడానికి మాత్రం స్వచ్ఛమైన నీరు దొరకదని చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మరో 25 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటనే ఆలోచన తన మనసును తొలచివేసిందని చెప్పుకొచ్చారు. ఆ ఆలోచనే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని పవన్ స్పష్టం చేశారు. 

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని పవన్ అభిప్రాయపడ్డారు. ఒక్క ఓటమి తనను క్రుంగదీస్తుందా? ఒక్క ఓటమి జనసైనికుల్ని వెనక్కి నెడుతుందా? అని ప్రశ్నించారు. ఎన్నో పరాజయాల్ని తట్టుకొని నిలబడిన తమకు ఈ ఓటమి ఏమీ చేయలేదన్నారు. 

తన వ్యక్తిగత లాభం కోసం అయితే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, ఆఫీసులు కట్టనక్కర్లేదని, ఇతరుల చేత తాను మాటలు పడక్కర్లేదని చెప్పుకొచ్చారు. కేవలం తాను ఒక్కడినే పోటీ చేస్తే సరిపోయేది అని చెప్పుకొచ్చారు. 

తాను కోరుకున్న తన స్వార్థం కాదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పొత్తులపై అసత్య ప్రచారాలు చేశారని పవన్ గుర్తు చేశారు. 

తెలుగుదేశం పార్టీతో పొత్తు అని వైసీపీ, వైసీపీతో పొత్తు అని టీడీపీ, కాదు బీజేపీతో పొత్తు అని మరొక పార్టీ ఇలా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారని పవన్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలనుకుంటే నేరుగా పెట్టుకునే ధైర్యం తనకు ఉందన్నారు. కానీ తనకు అలాంటి అవసరం రాదని పవన్ ధీమా వ్యక్తం చేశారు. 
 
దొంగ చాటు పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి జనసేన పార్టీకి లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోట్లాది మంది అభిమానులతో చప్పట్లు కొట్టించుకునే స్థితిలో ఉండి, అన్నీ వదులుకుని ప్రజల కోసం‌ వచ్చానని పవన్ తెలిపారు. 

తనను టార్గెట్ చేస్తూ ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా ఇంకా తాను నిలబడ్డానంటే అందుకు తన సంకల్పమే కారణమన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయాన్ని తీసుకురావలన్నదే తన సంకల్పమని పవన్ తెలిపారు.  

అయితే రాజకీయ పార్టీ నడపడం అంత సులువైన పని కాదని ఇటీవలే తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

మరోవైపు జనసైనికులపై ఎక్కడైనా దాడులు జరిగితే సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అవసరం అయితే తాను రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎవరూ భయపడవద్దని కార్యకర్తలకు పవన్ సూచించారు. 

జనసేన పార్టీ వ్యవస్థ మార్పుకోసం పుట్టిన పార్టీ అని అందుకు ప్రతీ కార్యకర్త నిస్వార్థంగా పనిచేయాలని పవన్ సూచించారు. కీమో థెరపీ చేయించుకుంటూ జనసేన పార్టీ కోసం పని చేసిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థ మార్పు కోసం అలా నిజాయితీగా పనిచేసే వ్యక్తులు జనసేనకు అండగా ఉండటం తమ అదృష్టమన్నారు పవన్ కళ్యాణ్.  

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే....:నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios