అమరావతి: పవన్ కళ్యాణ్ 2014లో జనసేన రాజకీయ పార్టీని స్థాపించడం ఏమాత్రం ఇష్టం లేదని మెగాబ్రదర్, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పష్టం చేశారు. గతంలో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయయని అందువల్ల తమ కుటుంబీకులు ఎవరూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడాన్ని అంగీకరించలేదని తెలిపారు. 

తన తమ్ముడు ఎందుకు కష్టపడాలి అని తామంతా ఆలోచించామని చెప్పుకొచ్చారు. తన సోదరుడు చిరంజీవి ఎంత ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసనని అందువల్లే తాను ఆ ఇబ్బందులు తన తమ్ముడు పవన్ పడకూడదని తాను ఆలోచించానని చెప్పుకొచ్చారు. 

అందువల్లే తాను పవన్ పార్టీపెట్టడంపై విముఖత చూపినట్లు తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ రోజు తాను గోవాలో సినిమా షూటింగ్ లో ఉన్నానని తెలిపారు. షూటింగ్ మధ్యలో ఆపేసి పవన్ కళ్యాణ్ స్పీచ్ రెండు గంటల సేపు విన్నట్లు చెప్పుకొచ్చారు నాగబాబు. 

స్పీచ్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆదర్శాలు తెలుసుకున్నానని దాన్ని ఎంతవరకు అందుకోగలుగుతాడా అని సందేహించానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం, పార్టీ సిద్ధాంతాలను తాను అర్థం చేసుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని చెప్పుకొచ్చారు. 

పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని నాగబాబు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని ఆయన ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ పట్టుదల, అకుంఠిత దీక్ష ఫలితమే జనసేన పార్టీ ఇంత వరకు వచ్చిందని చెప్పుకొచ్చారు.

దేశంలో రాజకీయం ఒక ఆదాయ వనరుగా మారిపోయిందని నాగబాబు అభిప్రాయపడ్డారు. దాదాపు 80శాతం మంది నాయకులు రాజకీయాలను ఆర్థిక వనరులుగా చూస్తున్నారని అయితే పవన్ కళ్యాణ్ లాంటి కొద్దిమంది మాత్రమే ప్రజల కోసం ఏదీ ఆశించకుండా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

జనసేన పార్టీలో సభ్యత్వం లేకపోయినా తాను జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని చెప్పుకొచ్చారు. అనంతరం తనను జనసేన పార్టీలో చేరేలా పార్టీ విధానాలు తనను ఆకర్షించాయని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీలో అందరికంటే తాను జూనియర్ నని చెప్పుకొచ్చారు. 

భవిష్యత్ లో జనసేన పార్టీ బలోపేతానికి తాను అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. తనను పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా నియమించి ఒక బాధ్యత అప్పగించారని దాన్ని చిత్తశుద్ధితో నెరవేరుస్తానని తెలిపారు.